MS Dhoni: ధోనీనే ‘గాడ్‌ ఆఫ్‌ ఝార్ఖండ్‌ క్రికెట్‌’’: సౌరభ్‌ తివారీ

ఎంఎస్ ధోనీ భారత క్రికెట్‌నే మార్చేసిన అతి కొద్దిమంది కెప్టెన్లలో ఒకరు. అలాగే ఝార్ఖండ్‌లో క్రికెట్‌ను ఎక్కువమంది ఫాలో కావడానికి అతడూ కారణమే.

Published : 01 Mar 2024 18:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా క్రికెట్‌ రూపురేఖలు మార్చిన కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ ముందుంటాడు. భారత్‌కు టీ20, వన్డే, ఛాంపియన్స్‌ ట్రోఫీలను అందించిన ఏకైక సారథి అతడే. ఐపీఎల్‌లోనూ సీఎస్‌కేకు ఐదు టైటిళ్లను సాధించి పెట్టాడు. ఝార్ఖండ్‌ డైనమైట్‌గా పేరొందిన ధోనీని అదే రాష్ట్రం నుంచి వచ్చిన మాజీ క్రికెటర్ ప్రశంసలతో ముంచెత్తాడు. సౌరభ్ తివారీ ఎక్కువగా టీమ్‌ఇండియాకు (3 వన్డేలు) ఆడకపోయినా దేశవాళీలో మాత్రం అదరగొట్టేశాడు. విరాట్ కోహ్లీ గెలిచిన అండర్ -19 వరల్డ్‌ కప్‌ జట్టులో ఇతడూ సభ్యుడే. అయితే, ఐపీఎల్‌లోనే చివరిసారిగా 2021 సీజన్‌లో ఆడాడు. ఇప్పుడు రంజీ ట్రోఫీ ముగిసిన తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఈక్రమంలో తమ రాష్ట్రం నుంచి వచ్చిన ధోనీని ‘గాడ్‌’గా అభివర్ణించాడు. 

‘‘ధోనీ భారత జట్టుకు ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి మా జట్టుకు గుర్తింపు లభించింది. అందుకే, అతడిని గాడ్‌ ఆఫ్‌ ఝార్ఖండ్‌ క్రికెట్‌ అని పిలుచుకుంటాం. ఇప్పుడు ప్రతిఒక్కరికీ ఝార్ఖండ్‌ గురించి తెలిసింది. ధోనీ మా అందిరిలో నమ్మకం కలిగించాడు. నగరంలో ఉన్నాడంటే.. తప్పకుండా మా ప్రాక్టీస్ సెషన్స్‌కు వస్తాడు. కొన్నిసార్లు వార్మప్‌ మ్యాచుల్లోనూ పాల్గొంటాడు. ప్రతీ విషయంలో మద్దతుగా నిలుస్తాడు. జట్టుకు సారథ్యం వహించినప్పుడు కూడా ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. ఒక్కోసారి సరైన ప్రదర్శన ఇవ్వకపోయినా మద్దతుగా నిలుస్తాడు. బౌలర్లూ రాణించేందుకు అవకాశం కల్పిస్తాడు. పిచ్‌ ఎలా స్పందిస్తుంది.. ఏ బంతికి ఎలాంటి ఫీల్డింగ్‌ సెటప్‌ పెట్టాలనేది చెబుతాడు’’ అని సౌరభ్‌ తివారీ వెల్లడించాడు. 

ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసిన ధోనీ.. 

మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్ (IPL 2024) కోసం ధోనీ ఇప్పటికే ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండానే చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపాడు. ఇప్పుడు మరోసారి డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా సీఎస్‌కే అడుగు పెట్టనుంది. తొలి మ్యాచ్‌ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో సీఎస్‌కే (CSK vs RCB) తలపడనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని