Gambhir - Virat: కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.. లేకపోతే అంతా విరాట్‌లా ఉండాలనుకుంటారు: మనోజ్‌

ఐపీఎల్ సీజన్‌ (IPL 2023) సజావుగా జరగాలంటే బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని.. ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకునే అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మనోజ్‌ తివారీ పేర్కొన్నాడు.

Published : 06 May 2023 01:34 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో (IPL) రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు - లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ (LSG vs RCB) మ్యాచ్‌లో విరాట్ - గంభీర్ వాగ్వాదంపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. ఆయా జట్ల అభిమానులు వారికి ఇష్టమైన క్రికెటర్లకు మద్దతుగా సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ ఆటగాడు మనోజ్ తివారీ కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సంఘటన జరగడానికి గల కారణాలను వెలికి తీయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. మైదానంలో వారిద్దరు ప్రవర్తించిన తీరు సరైందికాదని పేర్కొన్నాడు. గంభీర్‌ లేదా విరాట్‌ను ఇలాంటి ‘దూకుడు’తో గుర్తు పెట్టుకోవాలని అనుకోవడం లేదని తెలిపాడు. భారత్‌ జట్టు కోసం చేసిన కృషిని మాత్రమే తలుచుకుంటారని వ్యాఖ్యానించాడు. 

‘‘విరాట్ - గంభీర్‌ గొప్ప ఆటగాళ్లు. వీరిలో విరాట్ ఇంకా ఆడుతూనే ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో అతడొకడు. ఇలాంటి వ్యవహారంపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. క్రికెట్‌కు రాయబారిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రవర్తనను అసలు ఉపేక్షించకూడదు. ప్రపంచంలోనే అత్యంత భారీ టోర్నీ ఐపీఎల్‌. ఇలాంటి సంఘటనలను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు చూస్తారు. మరీ ముఖ్యంగా యువతలో ఎక్కువ మంది విరాట్ కోహ్లీలా మారాలని కోరుకుంటారు. అందుకే బీసీసీఐ కఠిన చర్యలకు ఉపక్రమించాలి. వివాదంపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలి. ఆరోగ్యకరమైన పోటీతత్వం క్రీడలకు మంచిది. కానీ, ఇలాంటి సంఘటనలను మాత్రం కచ్చితంగా  అడ్డుకొని తీరాల్సిందే’’అని మనోజ్ తివారీ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని