కోహ్లీసేన.. ఆరంభమే అదిరిపోయేలా..!

పొట్టి క్రికెట్‌ సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన టీమ్‌ఇండియా దానిని గెలుపుతో ముగించింది. ఆఖరి టీ20లో బ్యాటు, బంతితో చెలరేగింది. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు వన్డే సిరీసుకు సమరభేరీ మోగిస్తోంది. టీ20 ప్రపంచకప్‌నకు అదనపు సన్నద్ధతే లక్ష్యంగా ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల్లో తలపడనుంది...

Updated : 22 Mar 2021 19:41 IST

ప్రతీకారేచ్ఛతో ఇంగ్లాండ్‌

మంగళవారమే తొలి వన్డే

పొట్టి క్రికెట్‌ సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన టీమ్‌ఇండియా దానిని గెలుపుతో ముగించింది. ఆఖరి టీ20లో బ్యాటు, బంతితో చెలరేగింది. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు వన్డే సిరీసుకు సమరభేరీ మోగిస్తోంది. టీ20 ప్రపంచకప్‌నకు అదనపు సన్నద్ధతే లక్ష్యంగా ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల్లో తలపడనుంది. మరోవైపు టెస్టు, టీ20 సిరీసుల్ని కోల్పోయిన ఆంగ్లేయులు ఇందులోనైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు.


గబ్బర్‌ ఫామ్‌కు కీలకం

ప్రస్తుతం టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ పైనే అందరి చూపూ నెలకొంది. టీ20 సిరీసులో ఒకే మ్యాచ్‌ ఆడి విఫలమైన అతడు రోహిత్‌శర్మతో కలిసి వన్డే సిరీసులో ఓపెనింగ్‌ చేస్తాడని సమాచారం. శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌ వంటి కుర్రాళ్లతో అతడికి గట్టి పోటీ నెలకొంది. అందుకే అతడీ సిరీసులో రాణించడం అత్యంత అవసరం. టీ20లతో పోలిస్తే వన్డేల్లో క్రీజులో నిలదొక్కుకొనేందుకు తగిన సమయం ఉండటం గబ్బర్‌కు కలిసొచ్చే అంశం. మూడు వన్డేల్లో రాణించి.. ఐపీఎల్‌లో అదరగొడితే అతడు టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉంటాడని అనడంలో సందేహం లేదు!


కోహ్లీ సెంచరీపై ఆశలు

హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. సారథి విరాట్‌ కోహ్లీ తిరిగి లయ అందుకున్నాడు. టీ20 సిరీసులో తనదైన శైలిలో కళాత్మక విధ్వంసాలు సృష్టించాడు. అతడు శతకం చేయక దాదాపుగా 20 నెలలు అవుతోంది. 2019, ఆగస్టులో వెస్టిండీస్‌ (114*)పై చివరి సెంచరీ చేశాడు. ఇప్పుడున్న ఫామ్‌లో అతడు 44వ శతకం చేయడం పక్కా అనిపిస్తోంది! పొట్టి సిరీసులో వైఫల్యాలతో సతమతమైన కేఎల్‌ రాహుల్‌, కొన్నాళ్లు జట్టుకే ఎంపికవ్వని రిషభ్‌ పంత్‌కు తుదిజట్టులో చోటు దక్కుతుందని సమాచారం. మిడిలార్డర్‌లో హార్దిక్‌ పాండ్యతో పాటు వీరిద్దరూ కీలకం అవుతారు. సూర్యకుమార్‌, శ్రేయస్‌ అయ్యర్‌లో ఎవరో ఒకరికే చోటు దక్కేలా ఉంది. వీరిద్దరూ చక్కని ఫామ్‌లో ఉన్నారు.


భువనేశ్వర్‌ నేతృత్వం

సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌ దాడికి నేతృత్వం వహించనున్నాడు. శార్దూల్‌ ఠాకూర్‌తో అతడు కొత్త బంతిని పంచుకోనున్నాడు. వీరిద్దరూ కలిసి టీ20 సిరీసులో 12 వికెట్లు తీశారు. యువ ఆటగాడు ప్రసిధ్‌ కృష్ణ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే తొలి వన్డేలో చోటుపై స్పష్టత లేదు. ఈ మధ్యే ముగిసిన విజయ్‌ హజారేలో అతడు 7 మ్యాచుల్లో 24.5 సగటుతో 14 వికెట్లు పడగొట్టడం గమనార్హం. నటరాజన్ రూపంలో మరో యార్కర్ల వీరుడు అందుబాటులో ఉన్నాడు. కృనాల్‌ పాండ్య, కుల్‌దీప్‌ కన్నా యుజ్వేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వైపే కోహ్లీ మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎన్ని ఓవర్లు వేస్తాడన్నదాన్ని బట్టి హార్దిక్‌ పాండ్య ఐదో బౌలర్‌గా కొనసాగనున్నాడు.


పట్టుదలతో ఇంగ్లాండ్‌

మరోవైపు 1-3తో టెస్టు, 2-3తో టీ20 సిరీసు చేజార్చుకున్న ఇంగ్లాండ్‌ ప్రతీకారంతో ఉంది! టెస్టులతో పోలిస్తే టీ20 సిరీస్‌ ఓటమి వారిని మరింత కలవరపెట్టే అంశం. అందుకే వన్డే సిరీస్‌నైనా సొంతం చేసుకోవాలని ప్రపంచ విజేత పట్టుదలతో ఉంది. జోస్‌ బట్లర్‌, జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌ స్టో వీరోచిత ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అత్యంత కీలకం కానున్నాడు. మిడిలార్డర్‌లో ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ఒంటిచేత్తో మ్యాచులు గెలిపించగలడు. ఇక మార్క్‌వుడ్‌ తన నిఖార్సైన వేగంతో టీమ్‌ఇండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. జోఫ్రా ఆర్చర్‌ గాయపడటంతో క్రిస్‌ జోర్డాన్‌, సామ్‌ కరన్‌తో అతడు బంతిని పంచుకోవాల్సి ఉంటుంది. స్పిన్‌ ద్వయం మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌తో కోహ్లీసేనకు పెద్దగా ఇబ్బందేమీ లేదు. ఏమైనా చేయాలంటే వారు కొత్త వ్యూహాలు పన్నాల్సిందే. అలీ హిట్టింగ్‌ చేయడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.


రెండు జట్లు ఇవే

భారత్‌: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, నటరాజన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిధ్‌ కృష్ణ, శార్దూల్‌ ఠాకూర్‌

ఇంగ్లాండ్‌: మొయిన్‌ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్‌ బిల్లింగ్స్‌, జోస్‌ బట్లర్‌, సామ్‌ కరన్‌, టామ్‌ కరన్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌, మ్యాట్‌ పార్కిన్‌సన్‌, ఆదిల్‌ రషీద్‌, జేసన్‌ రాయ్‌, బెన్‌ స్టోక్స్‌, రీస్‌ టాప్లే, మార్క్‌ వుడ్‌. (కవర్స్‌) జేక్‌ బాల్‌, క్రిస్‌ జోర్డాన్‌, డేవిడ్‌ మలన్‌

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని