IND vs ENG: శుభ్‌మన్‌ గిల్‌ ఫామ్‌ అందుకోవాలంటే.. రాహుల్ ద్రవిడ్‌ చేయాల్సిందదే: పీటర్సెన్

శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) మళ్లీ పుంజుకొని ఫామ్‌లోకి రావడం భారత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చేతుల్లోనే ఉందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ వ్యాఖ్యానించాడు.

Published : 27 Jan 2024 20:51 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో (IND vs ENG) భారత యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్ విఫలమయ్యాడు. ఇటీవల టెస్టుల్లో గొప్పగా రాణించలేకపోతున్నాడు. గిల్‌లో అద్భుతమైన నైపుణ్యం ఉందని.. అయినా రాణించలేకపోతున్నాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సెన్ వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌కు కెవిన్‌ కీలక సూచనలు చేశాడు. గిల్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నాడు. 

‘‘శుభ్‌మన్‌ గిల్ ఆటతీరును మార్చగలిగే శక్తి రాహుల్‌ ద్రవిడ్‌కే ఉంది. ఇప్పుడు నేను చెప్పే మాటలను కోచ్‌ బ్రాడ్‌కాస్ట్‌లో చూస్తాడో లేదో తెలియదు. గిల్ మళ్లీ పుంజుకొని విజృంభించాలంటే మాత్రం కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ చేయాల్సింది చాలా ఉంది. గిల్‌తో మాట్లాడి.. ఎక్కువ సమయం గడపడం వల్ల తప్పకుండా ఆటలో మార్పు వస్తుందని భావిస్తున్నా. ప్రాక్టీస్‌, స్ట్రైక్‌ రొటేట్‌ ఎలా చేయాలనే దానిపై కసరత్తు వల్ల మరింత మెరుగవుతాడు. గిల్ టాలెంట్‌ విషయంలో సందేహం అక్కర్లేదు. అతడిలో ఒకే ఒక్క లోపం కనిపిస్తోంది. స్ట్రైక్‌ను రొటేట్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. మరీ ముఖ్యంగా స్పిన్నర్ల విషయంలో వెనకడుగు వేస్తున్నాడు. షాట్ల ఎంపికలో ఇప్పటికీ కుర్రతనం పోలేదు. అతడికి అర్థమయ్యేలా చెప్పగలడం, దారిలోకి తేవడం కోచింగ్‌ స్టాఫ్ బాధ్యత. ఇవన్నీ రాహుల్ ద్రవిడ్‌ స్వయంగా పర్యవేక్షించాలి. ఒక్కసారి కుదురుకుంటే మాత్రం గిల్ వెనక్కి తిరిగి చూడడు’’ అని కెవిన్‌ వ్యాఖ్యానించాడు. 

ఉప్పల్‌ టెస్టులో గిల్ 23 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లో కుదురుకునేందుకు సమయం తీసుకున్నప్పటికీ దానిని భారీ ఇన్నింగ్స్‌గా మార్చడంలో విఫలమయ్యాడు. మొత్తం 66 బంతులు ఆడిన గిల్ రెండు బౌండరీలు బాదాడు. అనవసర షాట్‌కు యత్నించి మిడ్‌వికెట్‌ ఫీల్డర్‌కు దొరికిపోయాడు. అంతకముందు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లోనూ గొప్పగా రాణించలేకపోయాడు. మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం కావడంతో విమర్శలు వస్తున్నాయి. గతేడాది ఆసీస్‌తో నాలుగో టెస్టులో సెంచరీ సాధించిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం కూడా అతడి ఆటపై ప్రభావం పడుతుందనేవారూ లేకపోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని