WT20 WC: చేజేతులా..

ఇప్పటికే అయిదు టైటిళ్లతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ఆస్ట్రేలియా. ఎలాంటి తప్పిదాలు లేకుండా, ఉత్తమంగా ఆడినా చివరకు ఆసీస్‌ చేతిలో తలవంచక తప్పని పరిస్థితి ఎన్నోసార్లు వివిధ జట్లకు ఎదురైంది.

Updated : 24 Feb 2023 11:57 IST

ప్పటికే అయిదు టైటిళ్లతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ఆస్ట్రేలియా. ఎలాంటి తప్పిదాలు లేకుండా, ఉత్తమంగా ఆడినా చివరకు ఆసీస్‌ చేతిలో తలవంచక తప్పని పరిస్థితి ఎన్నోసార్లు వివిధ జట్లకు ఎదురైంది. అందులో టీమ్‌ఇండియా కూడా ఉంది. అలాంటిది అన్ని తెలిసి కూడా సెమీస్‌లో అనవసర తప్పిదాలతో చేజేతులా భారత్‌ ఓటమి కొనితెచ్చుకుంది. ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు పట్టలేక, మైదానంలో చురుగ్గా కదల్లేక, బ్యాటింగ్‌లో వికెట్లు పారేసుకుని చివరకు భారీ మూల్యం చెల్లించుకుంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఇద్దరు బ్యాటర్లు బెత్‌ మూనీ, మెగ్‌ లానింగ్‌. ఈ ఇద్దరినీ ఔట్‌ చేసే అవకాశాలను టీమ్‌ఇండియా వృథా చేసింది. స్నేహ్‌ రాణా వేసిన ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో లానింగ్‌ క్యాచ్‌ను వికెట్‌కీపర్‌ రిచా పట్టలేకపోయింది. బ్యాట్‌ను ముద్దాడి ఎక్కువగా స్పిన్‌ తిరగకుండానే నేరుగా వచ్చి చేతుల్లో పడ్డ బంతిని ఆమె అందుకోలేదు. అప్పుడు లానింగ్‌ స్కోరు కేవలం 1 మాత్రమే. ఆ తర్వాతి ఓవర్లోనే రాధ బౌలింగ్‌లో మూనీ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను లాంగాన్‌లో షెఫాలీ వదిలేసింది. బద్దకంగా కదిలిన షెఫాలీ చేతుల్లో నుంచి జారిపడ్డ బంతి బౌండరీ లైన్‌ను తాకింది. అప్పుడు మూనీ స్కోరు 32. 13వ ఓవర్లో లానింగ్‌ను స్టంపౌట్‌ చేసే అవకాశాన్నీ రిచా వృథా చేసింది. బంతిని సరైన సమయంలో పట్టలేక ఆలస్యంగా స్టంప్స్‌ను ఎగరగొట్టింది. అప్పటికే లానింగ్‌ క్రీజులోకి వచ్చింది. అప్పుడు ఆమె స్కోరు 9. 17వ ఓవర్లో అయిదో బంతికి వికెట్‌కీపర్‌ వైపు జెమీమా త్రో విసిరితే గార్డ్‌నర్‌ రనౌట్‌ అయ్యేది. కానీ బౌలర్‌ వైపు త్రో విసిరింది. అంతేకాకుండా కొన్ని బంతులు ఫీల్డర్ల చేతుల్లో నుంచి జారి వెళ్లిపోయాయి. ఈ ఫీల్డింగ్‌ తప్పిదాలే మ్యాచ్‌లో భారత కొంపముంచాయి. బ్యాటింగ్‌లోనూ నిర్లక్ష్యం కనిపించింది. ఓపెనర్లు షెఫాలీ, స్మృతి మంధాన బంతిని డిఫెండ్‌ చేయలేక వికెట్ల ముందు దొరికిపోయారు. ఈ మ్యాచ్‌లో అదనపు బ్యాటర్‌గా వచ్చిన యాస్తిక లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగింది. షార్ట్‌మిడ్‌వికెట్‌లోకి బంతిని పంపిన ఆమె పరుగు కోసం జెమీమాను పిలిచింది. కానీ అక్కడ ఫీల్డర్‌ను గమనించిన జెమీమా.. యాస్తికాను వెనక్కి వెళ్లమని చెప్పింది. ఆమె క్రీజులోకి వెళ్లేసరికే స్టంప్స్‌ ఎగిరిపోయాయి. ఇక దురదృష్టవశాత్తు హర్మన్‌ రనౌట్‌ భారత అవకాశాలను దెబ్బతీసింది. సెమీఫైనల్లో బౌలింగ్‌, బ్యాటింగ్‌లో రెండు జట్లు సమానంగా కనిపించాయి. రెండు జట్లకు మధ్య అంతరం ఫీల్డింగే. మ్యాచ్‌ చేజారుతున్న సమయంలోనూ ఆస్ట్రేలియా సూపర్‌ ఫీల్డింగ్‌తో అదరగొట్టి విజయాన్ని అందిపుచ్చుకుంది. మొత్తానికి మరోసారి టీమ్‌ఇండియా ఆశలు కుప్పకూలాయి. చివరగా మరో ప్రపంచకప్‌.. మరో నాకౌట్‌.. మరో ఓటమి.. మరోసారి భారత అభిమానులకు నిరాశ.. కప్పు కల కలగానే మిగిలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని