DC vs KKR: దిల్లీ ఎట్టకేలకు

వరుస పరాభవాలతో తల్లడిల్లిన దిల్లీ క్యాపిటల్స్‌కు ఊరట. ఐపీఎల్‌-16లో ఆ జట్టు బోణీ కొట్టింది. అయిదు వరుస ఓటముల అనంతరం దిల్లీ తొలి విజయాన్నందుకుంది.

Updated : 21 Apr 2023 08:00 IST

ఐపీఎల్‌-16లో తొలి విజయం
ఉత్కంఠపోరులో కోల్‌కతా ఓటమి

వరుస పరాభవాలతో తల్లడిల్లిన దిల్లీ క్యాపిటల్స్‌కు ఊరట. ఐపీఎల్‌-16లో ఆ జట్టు బోణీ కొట్టింది. అయిదు వరుస ఓటముల అనంతరం దిల్లీ తొలి విజయాన్నందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. వార్నర్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అలవోకగా గెలిచేలా కనిపించిన దిల్లీ.. అనూహ్యంగా తడబడి కష్టంగా గట్టెక్కింది. కోల్‌కతాకు ఇది వరుసగా మూడో ఓటమి.

దిల్లీ క్యాపిటల్స్‌ గెలుపు రుచి చూసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై నెగ్గింది. వర్షం వల్ల ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌లో మొదట కోల్‌కతా తడబడింది. ఇషాంత్‌ (2/19), నోకియా (2/20), అక్షర్‌ (2/13), కుల్‌దీప్‌ (2/15) ధాటికి 20 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. జేసన్‌ రాయ్‌ (43; 39 బంతుల్లో 5×4, 1×6), రసెల్‌ (38 నాటౌట్‌; 31 బంతుల్లో 1×4, 4×6) బ్యాటుతో రాణించారు. వార్నర్‌ (57; 41 బంతుల్లో 11×4) మెరుపులకు అక్షర్‌ పటేల్‌ (19 నాటౌట్‌; 22 బంతుల్లో 1×4) పోరాటం తోడవడంతో లక్ష్యాన్ని దిల్లీ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

వార్నర్‌ చెలరేగినా..: కోల్‌కతా బ్యాటర్లు తడబడ్డ అదే పిచ్‌పై వార్నర్‌ అలవోకగా ఆడటంతో దిల్లీ గెలవడం తేలికే అనిపించింది. 7 ఓవర్లలోనే స్కోరు 62/1. ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగిన వార్నర్‌... ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. నరైన్‌ ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు దంచేశాడు. అయితే సాఫీగా విజయం దిశగా సాగుతున్నట్లనిపించిన దిల్లీ.. అనూహ్యంగా  చెమటోడ్చాల్సి వచ్చింది. అయిదు పరుగుల వ్యవధిలో మార్ష్‌ (2), సాల్ట్‌ (5)ను ఔటయ్యారు.  ఆ తర్వాత మనీష్‌ పాండేతో కలిసి వార్నర్‌ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. 14వ ఓవర్లో జట్టు స్కోరు 93 వద్ద వార్నర్‌ వికెట్ల ముందు దొరికిపోవడంతో దిల్లీపై కాస్త ఒత్తిడి పెరిగింది. పాండే, అక్షర్‌ పటేల్‌ నిలవడంతో 15.4 ఓవర్లలో 110/4తో లక్ష్యానికి చేరువైన దిల్లీ.. పాండే (21), అమన్‌ హకీమ్‌ వికెట్లు కోల్పోయి మరింత ఒత్తిడిలో పడింది. అక్షర్‌, లలిత్‌లకు సింగిల్స్‌ తీయడం కూడా చాలా కష్టమైపోయింది. ఓ దశలో 6 వికెట్లు చేతిలో ఉండగా 30 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉన్న దిల్లీ... చివరి రెండు ఓవర్లలో 12 చేయాల్సిన స్థితికి వచ్చింది. తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ లలిత్‌తో కలిసి అక్షర్‌.. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగా పని పూర్తి చేశాడు.

కోల్‌కతా కష్టంగా..: వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌లో అంతకుముందు పరుగుల కోసం కోల్‌కతా చెమటోడ్చింది. బ్యాటింగ్‌కు అంత తేలిగ్గా లేని పిచ్‌పై దిల్లీ బౌలర్లు కట్టుద్టిటంగా బౌలింగ్‌ చేయడంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్‌ ఏ దశలోనూ ఊపందుకోలేదు. భారీ షాట్లు కష్టం కావడంతో బౌండరీలు ఎక్కువగా రాలేదు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి లిటన్‌ దాస్‌ (4), వెంకటేశ్‌ అయ్యర్‌ (0), నితీశ్‌ రాణా (4) వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది. ఇషాంత్‌ శర్మ 3 ఓవర్లలో 14 పరుగులిచ్చి ఓ వికెట్‌ పడగొట్టాడు. అయితే దిల్లీ బౌలర్లు ఒత్తిడి తెస్తున్నా ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. అయితే అతడు కూడా ధాటిగా ఏమీ ఆడలేకపోయాడు. కానీ కొన్ని మంచి షాట్లు ఆడాడు. జట్టు కుప్పకూలలేదంటే అది అతడి చలవే. అయితే రాయ్‌ నిలబడ్డా వికెట్ల పతనం మాత్రం ఆగలేదు. ఎవరూ నిలబడలేదు. వచ్చిన బ్యాటర్‌ వచ్చినట్లే వెనుదిరిగాడు. మన్‌దీప్‌ (12), రింకూ సింగ్‌ (6), నరైన్‌ (4) విఫలమయ్యారు. 13 ఓవర్లకు స్కోరు 77/6. ఇక బ్యాట్‌ ఝుళిపిద్దామనుకున్న రాయ్‌.. 15వ ఓవర్లో కుల్‌దీప్‌ బంతిని స్వీప్‌ చేయబోయి క్యాచ్‌ ఔటయ్యాడు. అదే ఓవర్లో అనుకుల్‌ రాయ్‌ని కూడా కుల్‌దీప్‌ వెనక్కి పంపాడు. కోల్‌కతా 94/8తో నిలిచింది. 12వ ఓవర్‌ నుంచి క్రీజులోనే ఉన్నా.. రసెల్‌ కూడా అప్పటికి పరుగుల కోసం కష్టపడుతున్నాడు. 16వ ఓవర్లో జట్టు స్కోరు 96వ వద్ద ఉమేశ్‌ తొమ్మిదో వికెట్‌గా నిష్క్రమించాడు. వరుణ్‌ చక్రవర్తి (1)తో కలిసి రసెల్‌ ఇన్నింగ్స్‌ను నడిపించినా.. 19 ఓవర్లకు స్కోరు 108/9 మాత్రమే. కానీ ఆఖరి ఓవర్లో ముకేశ్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్స్‌లు బాదిన రసెల్‌ కోల్‌కతాకు పోరాడేందుకు అవకాశమున్న స్కోరును అందించాడు.

కోల్‌కతా ఇన్నింగ్స్‌: జేసన్‌ (సి) అమన్‌ (బి) కుల్‌దీప్‌ 43; లిటన్‌ (సి) లలిత్‌ (బి) ముకేశ్‌ 4; వెంకటేశ్‌ (సి) మార్ష్‌ (బి) నోకియా 0; నితీష్‌  (సి) ముకేశ్‌ (బి) ఇషాంత్‌ 4; మన్‌దీప్‌ (బి) అక్షర్‌ 12; రింకూ (సి) లలిత్‌ (బి) అక్షర్‌ 6; నరైన్‌ (సి) వార్నర్‌ (బి) ఇషాంత్‌ 4; రసెల్‌ నాటౌట్‌ 38; అనుకుల్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 0; ఉమేశ్‌ (సి) అండ్‌ (బి) నోకియా; వరుణ్‌ చక్రవర్తి రనౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (20 ఓవర్లలో ఆలౌట్‌) 127; వికెట్ల పతనం: 1-15, 2-25, 3-32, 4-50, 5-64, 6-70, 7-93, 8-93, 9-96; బౌలింగ్‌: ఇషాంత్‌ 4-0-19-2; ముకేశ్‌ 4-0-34-1; నోకియా 4-0-20-2; అక్షర్‌ 3-0-13-2; మిచెల్‌ మార్ష్‌ 2-0-25-0; కుల్‌దీప్‌ 3-0-15-2

దిల్లీ ఇన్నింగ్స్‌: వార్నర్‌ ఎల్బీ (బి) వరుణ్‌ 57; పృథ్వీ (బి) వరుణ్‌ 13; మిచెల్‌ మార్ష్‌ (సి) వీజ్‌ (బి) నితీశ్‌ 2; సాల్ట్‌ (సి) అండ్‌ (బి) అనుకుల్‌ 5; మనీష్‌ (సి) రింకూ (బి) అనుకుల్‌ 21; అక్షర్‌ నాటౌట్‌ 19; అమన్‌ (బి) నితీశ్‌ 0, లలిత్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 128; వికెట్ల పతనం: 1-38, 2-62, 3-67, 4-93, 5-110, 6-111; బౌలింగ్‌: ఉమేశ్‌ 1-0-6-0; కుల్వంత్‌ 1.2-0-20-0; రసెల్‌ 1-0-12-0;  నరైన్‌ 4-0-36-0; వరుణ్‌ చక్రవర్తి 4-1-16-2; అనుకుల్‌  4-0-19-2; నితీశ్‌ 4-0-17-2

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని