Ambati Rayudu: నేనెప్పుడూ రాజీపడలేదు
ఐపీఎల్‌లో అగ్రశ్రేణి జట్లు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లకు ప్రాతినిధ్యం వహించడమే కాదు.. ఒక్కో జట్టు తరఫున మూడేసి ట్రోఫీలు అందుకున్న ఆటగాడు మన అంబటి తిరుపతి రాయుడు.
సవాళ్లకు ఎదురునిలిచా
ప్రతిభనే నమ్ముకున్నా
ఐపీఎల్ వల్లే భారత్‌కు ఆడగలిగా
ధోనీతో 20 ఏళ్ల అనుబంధం
‘ఈనాడు’తో అంబటి రాయుడు
ఐపీఎల్‌లో అగ్రశ్రేణి జట్లు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లకు ప్రాతినిధ్యం వహించడమే కాదు.. ఒక్కో జట్టు తరఫున మూడేసి ట్రోఫీలు అందుకున్న ఆటగాడు మన అంబటి తిరుపతి రాయుడు. అండర్-19 ప్రపంచకప్ జట్టు కెప్టెన్‌గా, టీమ్‌ఇండియా ఆటగాడిగా, ఐపీఎల్ క్రికెటర్‌గా ఆటపై తనదైన ముద్ర వేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్‌తో చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించి ఆటకు వీడ్కోలు పలికిన రాయుడు.. తన 30 ఏళ్ల క్రికెట్ ప్రయాణంపై పంచుకున్న విశేషాలు ‘ఈనాడు’కు ప్రత్యేకం.
30 ఏళ్ల క్రికెట్ జీవితాన్ని మీరెలా విశ్లేషిస్తారు?
క్రికెట్‌పై ఇష్టంతో ఏడెనిమిదేళ్ల వయసులో బ్యాటు పట్టా. అప్పట్నుంచి ఆటే నా జీవితం. ఎలాంటి క్రికెట్ నేపథ్యం.. పలుకుబడి.. అండదండలు లేవు. ఎన్నో ఒడుదొడుకులు ఎదురయ్యాయి. ఎంతో మంది తొక్కేయాలని చూశారు. ఆటపై ఏకాగ్రత పెట్టనీయకుండా మానసికంగా కుంగిపోయేలా చేశారు. అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. కానీ ఎప్పుడూ ఎవ్వరికీ తలవంచలేదు. మైదానంలో.. బయటా నేనెప్పుడూ రాజీపడలేదు. ప్రతిభనే నమ్ముకుని సవాళ్లకు ధైర్యంగా ఎదురునిలిచా. ఒక్కో మెట్టు ఎక్కుతూ టీమ్‌ఇండియా వరకు వెళ్లా. ఐపీఎల్‌లో నా ఆటతో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లను మెప్పించా. ఆరు ట్రోఫీలు గెలిచిన రెండో ఆటగాడిగా అరుదైన ఘనత అందుకున్నా. గౌరవంగా ఆడా.. గర్వంగా వీడ్కోలు పలికా.
గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్ ఎలాంటి అనుభూతిని మిగిల్చింది?
జీవితాంతం గుర్తుంచుకునే ఇన్నింగ్స్ అది. కీలక సమయంలో క్రీజులోకి వెళ్లా. 18 బంతుల్లో 38 పరుగులు కావాలి. మోహిత్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అంతకుముందు ఓవర్లో శివమ్ దూబె రెండు సిక్సర్లు కొట్టడంతో ఇన్నింగ్స్‌లో జోష్ వచ్చింది. ఆ జోరును కొనసాగించాలంటే మోహిత్ బౌలింగ్‌లో ధాటిగా ఆడాలని భావించా. అలా వరుసగా 6, 4, 6 వచ్చాయి. రెండో సిక్సర్ నా కెరీర్‌లో అత్యుత్తమ షాట్లలో ఒకటి. ముందే అనుకుని ఆడిన షాట్ కాదది. బంతి గమనాన్ని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే ఆడా. ఎన్నో ఏళ్ల సాధన ఉంటేనే అలాంటి షాట్ ఆడగలం. అదృష్టవశాత్తు చెన్నై జట్టులో అందరూ అనుభవజ్ఞులే ఉన్నారు. నాకంటే ముందు రహానె కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నాణ్యమైన గుజరాత్ బౌలింగ్‌ను ఎదుర్కోడానికి చెన్నై ఆటగాళ్ల అనుభవమే కారణం. ఫైనల్లో గెలిచిన తర్వాత ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయా. 30 ఏళ్లుగా సాగుతున్న ప్రయాణాన్ని ఒక్కసారిగా ఆపేసినట్లుగా అనిపించింది. చిన్నప్పట్నుంచి ఎదురైన అనుభవాలు గుర్తొచ్చాయి. ఈ స్థాయికి చేరుకునేందుకు పడిన కష్టాలు కళ్ల ముందు మెదిలాయి.
2 బంతుల్లో 10 పరుగులు అవసరమైనప్పుడు మ్యాచ్‌పై ఆశలు ఉన్నాయా?
లక్ష్య ఛేదనలో మొదటి బంతి నుంచి మేం మంచి స్థితిలోనే ఉన్నాం. రుతురాజ్, కాన్వే మంచి ఆరంభాన్ని అందించారు. దూబె, రహానె ఇన్నింగ్స్ గేరు మార్చారు. నేను ఔటైనప్పుడు 14 బంతుల్లో 22 పరుగులు కావాలి. టీ20 ఫార్మాట్లో సులువైన సమీకరణం ఇది. మరొక్క భారీ షాట్ పడుంటే మ్యాచ్ పూర్తిగా చెన్నై నియంత్రణలో ఉండేది. కానీ చివర్లో షాట్లు వచ్చాయి. ధోని వికెట్ వెంటనే పడటం.. షమి గొప్పగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారిపోయింది. జడేజా మాత్రం ఎలాంటి ఒత్తిడి లేకుండా సిక్సర్, బౌండరీతో ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. నా ఆఖరి ఐపీఎల్ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేశాడు.
మిమ్మల్ని ఐపీఎల్ ట్రోఫీ తీసుకోవాల్సిందిగా ధోని కోరతాడని ఊహించారా?
లేదు. కానీ అదే ధోని గొప్పతనం. అతనిది మహోన్నత వ్యక్తిత్వం. ధోనీతో నాది 20 ఏళ్ల అనుబంధం. ఇండియా-ఎ, టీమ్‌ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్‌ల తరఫున అతనితో కలిసి ఆడే అదృష్టం లభించింది. విశాఖపట్నంలో పాకిస్థాన్‌పై ధోని సెంచరీకి ముందు ఇండియా-ఎ తరఫున మేమిద్దరం కలిసి ఆడాం. అప్పట్నుంచి అతనంటే నాకు గౌరవం. మైదానం బయట కూడా చాలా సాధారణంగా ఉంటాడు. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఇక మైదానంలో వైడ్, నోబాల్ లాంటి నిర్ణయాలపై వాట్సన్, నేను దూకుడుగా స్పందిస్తుంటాం. అందుకే ఫెయిర్ ప్లే పాయింట్లు కోత పడతాయంటూ ధోని సరదాగా అన్నాడు.
అత్యంత విజయవంతమైన ముంబయి, చెన్నై జట్ల తరఫున ఆడటం.. ఆరు ట్రోఫీలు గెలవడాన్ని ఐపీఎల్ చరిత్రలో గొప్ప ఘనతగా భావించొచ్చా?
ఘనత కంటే నాకు దక్కిన అరుదైన అవకాశంగా భావిస్తా. ఇటీవల 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడినప్పుడు ఆకాశ్ అంబానీ ప్రత్యేకంగా వీడియో సందేశంతో అభినందించాడు. ఫైనల్ ముగిశాక ధోనీ సహా జట్టులోని ఆటగాళ్లంతా నా గురించి మాట్లాడారు. నేనెప్పటికీ మరిచిపోలేని క్షణాలవి. ముంబయి, చెన్నైల తరఫున ఆడే అవకాశం రావడం నా అదృష్టం. రెండు జట్ల తరఫున ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదించా. మంచి రన్‌రేట్‌తో పరుగులు రాబట్టాను. ఇరు జట్లు మూడేసి మార్లు ట్రోఫీలు నెగ్గడంలో నా పాత్ర ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. రోహిత్‌శర్మ తర్వాత ఆరు ట్రోఫీలు అందుకోవడం గొప్ప అనుభూతినిస్తోంది.
దేశవాళీ, అంతర్జాతీయ, ఐపీఎల్ కెరీర్‌లలో మీకు ఏది ఎక్కువ సంతృప్తినిచ్చింది?
ఒకటి తక్కువ.. మరొకటి ఎక్కువ కాదు. దేశవాళీ క్రికెట్ ఆడబట్టే ఐపీఎల్‌కు వెళ్లా. అట్నుంచి టీమ్‌ఇండియాకు ఆడా. ఆట నేర్చుకున్నదే దేశవాళీ క్రికెట్లో. రిటైర్మెంట్ వరకు నన్ను నడిపించింది అదే. ఆరేడేళ్లు భారత జట్టులో ఉన్నా. 61 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడా. అంతకంటే ఎక్కువగా రిజర్వ్ బెంచ్‌లో కూర్చొని మ్యాచ్‌లు చూశా. ప్రతి మ్యాచ్ ఒక పాఠం. భారత జట్టుకు ఆడిన ప్రతి మ్యాచ్ చిరస్మరణీయమే. అహ్మదాబాద్‌లో శ్రీలంకపై తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించా. అదే వేదికలో రిటైరవడం ఆనందంగా ఉంది.
యువ ఆటగాళ్లకు మీరిచ్చే సలహాలేంటి?
ప్రతిభ ఉంటే ఎవ్వరూ ఆపలేరు. సిఫార్సులతో సెలెక్షన్స్‌ను నమ్ముకుంటే ఎప్పటికీ మంచి క్రికెటర్లు కాలేరు. విజయానికి దగ్గరి దారులు ఉండవు. ఆట నేర్చుకుంటే అవకాశాలకు కొదవలేదు. తిలక్‌వర్మ, మహ్మద్ సిరాజ్‌లే అందుకు నిదర్శనం. ఐపీఎల్‌లో దేశవాళీ ఆటగాళ్లు సత్తాచాటుతుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఐపీఎల్ వల్లే నేను టీమ్‌ఇండియాకు ఆడగలిగా. లేకపోతే దేశవాళీ క్రికెట్‌తోనే నా కెరీర్ ముగిసేది. ప్రతిభావంతులకు ఐపీఎల్ అద్భుతమైన వేదిక. ఆటగాడిలో సత్తా ఉంటే ఫ్రాంచైజీలే వెతుక్కుంటూ వస్తాయి.
16 సీజన్‌లలో చెన్నై, ముంబయి 10 సార్లు విజేతగా నిలిచాయి. ఆ రెండు జట్ల విజయ సూత్రం ఏమిటి?
తికమక, గందరగోళం లేకపోవడం. ఆటగాళ్ల ఎంపిక దగ్గర నుంచి ప్రదర్శన వరకు పూర్తి స్పష్టతతో ఉండటం. రెండు ఫ్రాంచైజీల అంతిమ లక్ష్యం ఒక్కటే అయినా.. అనుసరించే దృక్పథాలు వేరు. జట్టులో ప్రతి ఆటగాడి పాత్రపై ముంబయి ముందుగానే పూర్తి అవగాహనతో ఉంటుంది. ఎవరేం చేయాలో.. ఎలా చేయాలో పక్కా వ్యూహాన్ని రచించుకుంటుంది. ఆటగాళ్లు తమ ప్రణాళికను ఆచరణలో పెట్టేలా చేస్తుంది. చెన్నై తీరు భిన్నం. ప్రతి ఆటగాడిని ఆలోచింపజేస్తుంది. ఆటలో సొంతంగా ఎదిగేలా ప్రోత్సహిస్తుంది. తన ఆటను తానే మెరుగు పరుచుకునేలా ఆత్మవిశ్వాసం అందిస్తుంది. ఏదేమైనా రెండు ఫ్రాంచైజీలు సొంత వ్యూహాలు, ప్రణాళికలతో పూర్తి స్పష్టతతో ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World Culture Festival: ఘనంగా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే