Zimbabwe: చేరువై.. దూరమై

సొంతగడ్డపై ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌. లీగ్‌ దశలో అదిరే ప్రదర్శన. ఆడిన ప్రతి మ్యాచ్‌లో విజయం. వెస్టిండీస్‌ లాంటి పెద్ద జట్టు మీదా గెలుపు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్నింట్లోనూ జింబాబ్వే అదరహో.

Updated : 05 Jul 2023 08:34 IST

జింబాబ్వేకు గుండెకోత
స్కాట్లాండ్‌ చేతిలో ఓటమి
వన్డే ప్రపంచకప్‌కు దూరం

సొంతగడ్డపై ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌. లీగ్‌ దశలో అదిరే ప్రదర్శన. ఆడిన ప్రతి మ్యాచ్‌లో విజయం. వెస్టిండీస్‌ లాంటి పెద్ద జట్టు మీదా గెలుపు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్నింట్లోనూ జింబాబ్వే అదరహో. సూపర్‌-6 తొలి మ్యాచ్‌లోనూ ఘనవిజయం. మరోవైపు వెస్టిండీస్‌ ప్రపంచకప్‌ రేసు నుంచి నిష్క్రమించింది. దీంతో జింబాబ్వే ముందంజ వేయడం లాంఛనమే అనుకున్నారంతా! కానీ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన జింబాబ్వే.. అనూహ్యంగా ప్రపంచకప్‌కు దూరమైంది. మంగళవారం స్కాట్లాండ్‌ ఆ జట్టు ప్రయాణానికి తెరదించింది.

హరారె

న్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్‌ నిష్క్రమణ తర్వాత మరో షాక్‌. శ్రీలంక తర్వాత ప్రపంచకప్‌కు ఎంపికయ్యే జట్టుగా అందరూ భావించిన జింబాబ్వే.. మంగళవారం అనూహ్యంగా స్కాట్లాండ్‌ చేతిలో 31 పరుగుల తేడాతో ఓడి వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీకి దూరమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ 8 వికెట్లకు 234 పరుగులు చేసింది. లియాస్క్‌ (48), క్రాస్‌ (38), మెక్‌ములెన్‌ (34) తలో చేయి వేసి జట్టుకు పోరాడే స్కోరును అందించారు. జింబాబ్వే బౌలర్లలో సీన్‌ విలియమ్స్‌ (3/43), చటార (2/46) రాణించారు. అనంతరం జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌటైంది. లక్ష్యం చిన్నదే అయినా.. ఛేదనలో క్రిస్‌ సోల్‌ (3/33) దెబ్బకు జింబాబ్వే కుదేలై 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సికందర్‌ రజా (34), మద్వీర (40)లతో కలిసి గొప్పగా పోరాడిన ర్యాన్‌ బర్ల్‌ (83; 84 బంతుల్లో 8×4, 1×6) జట్టులో ఆశలు రేపాడు. 30 ఓవర్లకు 164/5తో జింబాబ్వే మంచి స్థితిలోనే కనిపించింది. కానీ మద్వీరను వ్యాట్‌ ఔట్‌ చేయడంతో స్కాట్లాండ్‌ మళ్లీ పోటీలోకి వచ్చింది. తర్వాత వికెట్ల పతనం ఆగలేదు. బర్ల్‌ మొండి పట్టుదలతో పోరాడినా.. విజయానికి 69 బంతుల్లో 38 పరుగులు అవసరమైన స్థితిలో తొమ్మిదో వికెట్‌ రూపంలో అతను వెనుదిరగడంతో జింబాబ్వేకు దారులు మూసుకుపోయాయి. కాసేపటికే ఇన్నింగ్స్‌కు తెరపడింది. మెక్‌ములెన్‌ (2/31), లియాస్క్‌ (2/33) బంతితోనూ మెరిశారు. సూపర్‌-6 తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించిన జింబాబ్వే.. రెండో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. స్కాట్లాండ్‌.. సూపర్‌-6లో వరుసగా వెస్టిండీస్‌, జింబాబ్వేలను ఓడించి ఆ జట్లను ఇంటిముఖం పట్టించడం విశేషం.

సంక్షిప్త స్కోర్లు: స్కాట్లాండ్‌: 234/8 (డియాస్క్‌ 48, క్రాస్‌ 38, మెక్‌ములెన్‌ 34; సీన్‌ విలియమ్స్‌ 3/43, చటార 2/46); జింబాబ్వే: 203 (బర్ల్‌ 83, మద్వీర 40, సికందర్‌ రజా 34; మెక్‌ములెన్‌ 2/31, లియాస్క్‌ 2/33)


రెండో బెర్తు ఎవరిది?

భారత్‌ ఆతిథ్యమిచ్చే 2023 ప్రపంచకప్‌కు క్వాలిఫయర్‌ నుంచి రెండు జట్లు ఎంపికవుతాయి. సూపర్‌-6 దశలో వరుసగా నెదర్లాండ్స్‌, జింబాబ్వేలను ఓడించిన శ్రీలంక ఇప్పటికే ఒక బెర్తును సొంతం చేసుకుంది. స్కాట్లాండ్‌ను ఓడిస్తే జింబాబ్వేకు మెరుగైన అవకాశాలుండేవి. కానీ ఓడిపోవడంతో ఆ జట్టు దారులు మూసుకుపోయాయి. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లున్నాయి. స్కాట్లాండ్‌ 6, నెదర్లాండ్స్‌ 4 పాయింట్లతో ఉన్నాయి. కానీ నెట్‌రన్‌రేట్‌లో జింబాబ్వే (-0.099) కంటే స్కాట్లాండ్‌ (+0.296), నెదర్లాండ్స్‌ (-0.042) మెరుగ్గా ఉన్నాయి. గురువారం తమ చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌, నెదర్లాండ్స్‌ తలపడనున్నాయి. అందులో స్కాట్లాండ్‌ గెలిస్తే దానికే బెర్తు సొంతమవుతుంది. నెదర్లాండ్స్‌ నెగ్గినా.. నెట్‌రన్‌రేట్‌లో స్కాట్లాండ్‌ను అధిగమిస్తేనే అది ముందంజ వేస్తుంది. లేదంటే స్కాట్లాండ్‌కే అవకాశం దక్కుతుంది. ఈ మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయినా.. స్కాట్లాండ్‌కే అవకాశం దక్కుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని