Sachin Tendulkar: దిగ్గజానికి ప్రేమతో

సొగసైన బ్యాటింగ్‌తో, కళ్లు తిప్పుకోనివ్వని షాట్లతో, బౌలర్లపై ఆధిపత్యంతో.. ప్రపంచ క్రికెట్‌ను ఏలిన దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌కు ముంబయి క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమానాన్ని అందించింది.

Updated : 02 Nov 2023 04:05 IST

వాంఖడెలో సచిన్‌ విగ్రహావిష్కరణ

ముంబయి: సొగసైన బ్యాటింగ్‌తో, కళ్లు తిప్పుకోనివ్వని షాట్లతో, బౌలర్లపై ఆధిపత్యంతో.. ప్రపంచ క్రికెట్‌ను ఏలిన దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌కు ముంబయి క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమానాన్ని అందించింది. ప్రతిష్ఠాత్మక వాంఖడె స్టేడియంలో సచిన్‌ కాంస్య విగ్రహాన్ని ఎంసీఏ ఏర్పాటు చేసింది. బుధవారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్టేడియంలో సచిన్‌ పేరుతో ఉన్న స్టాండ్‌ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బౌలర్‌ తల మీదుగా లాఫ్టెడ్‌ షాట్‌ ఆడుతున్నట్లుగా, ఎడమ కాలు ముందుండి, శరీరం కాస్త వంగినట్లు, బ్యాట్‌ ఆకాశం వైపు ఉన్నట్లుగా సచిన్‌ భంగిమ ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఈ విగ్రహం లాంటి చిన్న ప్రతిమను సచిన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా తన సొంత మైదానం వాంఖడెతో  ఉన్న అనుబంధాన్ని సచిన్‌ పంచుకున్నాడు. 1983లో వెస్టిండీస్‌, భారత్‌ మధ్య పోరు చూసేందుకు తొలిసారి పదేళ్ల వయసులో వాంఖడెకు వచ్చానని, అది కూడా టికెట్‌ లేకుండా మ్యాచ్‌ చూశానని సచిన్‌ గుర్తుచేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో సచిన్‌ కుటుంబ సభ్యులు, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఐసీసీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని