రాజ్‌కోట్‌లో ఆ ఇద్దరు..!

గాయాలతో సతమతమవుతున్న టీమ్‌ఇండియా మూడో టెస్టుకు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనుంది. దేశవాళీ పరుగుల యంత్రం సర్ఫరాజ్‌ ఖాన్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Published : 14 Feb 2024 04:27 IST

రాజ్‌కోట్‌:  గాయాలతో సతమతమవుతున్న టీమ్‌ఇండియా మూడో టెస్టుకు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనుంది. దేశవాళీ పరుగుల యంత్రం సర్ఫరాజ్‌ ఖాన్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అతడితో పాటు  హార్డ్‌ హిట్టింగ్‌ కీపర్‌-బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ అరంగేట్రం చేసినా ఆశ్చర్యం లేదు. గురువారం రాజ్‌కోట్‌ టెస్టు ప్రారంభంకానున్న నేపథ్యంలో భారత ఆటగాళ్లు మంగళవారం సాధన చేశారు. గత మ్యాచ్‌లో శతకం సాధించిన గిల్‌.. ఈ ఐచ్ఛిక ప్రాక్టీస్‌ సెషన్‌కు హాజరు కాలేదు. విశాఖలో రెండో టెస్టు సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తుండగా శుభ్‌మన్‌ గిల్‌ కుడి చూపుడు వేలికి గాయమైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా అతడు ఫీల్డింగ్‌ చేయలేదు. గాయం అంత తీవ్రమైందేమీ కాదని అప్పుడు చెప్పారు. ఇప్పుడు పరిస్థితేంటన్నది తెలియదు. శ్రేయస్‌ అయ్యర్‌పై వేటు పడగా.. రాహుల్‌ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో సర్ఫరాజ్‌కు మార్గం సుగమమైంది. రంజీ ట్రోఫీలో పరుగులు వరద పారిస్తున్న అతడు.. జాతీయ జట్టుకు ఆడడం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. ఇక భరత్‌ స్థానంలో జురెల్‌ను ఆడించాలని డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. భరత్‌తో పోలిస్తే మెరుగైన బ్యాటర్‌ కావడం జురెల్‌కు కలిసొస్తోన్న అంశం. ఒకవేళ జురెల్‌కు అవకాశం లభిస్తే.. రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌, జురెల్‌ 4 నుంచి 7 స్థానాల మధ్య బ్యాటింగ్‌ చేస్తారు. అంటే నలుగురు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లలో (మరో ఆటగాడు జడేజా) ముగ్గురి అనుభవం ఒక్క టెస్టే అన్నమాట. పటీదార్‌ విశాఖపట్నంలో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. పటీదార్‌, సర్ఫరాజ్‌ మంగళవారం స్లిప్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించారు. జురెల్‌ వికెట్‌కీపింగ్‌ చేశాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వీళ్ల సాధనను దూరం నుంచి కొద్దిసేపు పరిశీలించారు. ఆ తర్వాత రోహిత్‌ కూడా క్యాచ్‌లు ప్రాక్టీస్‌ చేశాడు. ద్రవిడ్‌ స్థానిక గ్రౌండ్స్‌మెన్‌తో చాలా సేపు మాట్లాడుతూ కనిపించాడు. ఇక ఆల్‌రౌండర్‌ జడేజా బౌలింగ్‌ కన్నా బ్యాటింగే ఎక్కువసేపు ప్రాక్టీస్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు