భారత్‌కు అఫ్గాన్‌ షాక్‌

69 నిమిషాల వరకు మ్యాచ్‌లో ఆధిక్యం.. బంతిపై చక్కని నియంత్రణ! ప్రత్యర్థి గోల్‌పోస్టుపై వరుస దాడులు! ఇవన్నీ చూస్తే విజయం భారత్‌దే అనిపించింది.

Published : 27 Mar 2024 01:52 IST

ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌

గువాహాటి: 69 నిమిషాల వరకు మ్యాచ్‌లో ఆధిక్యం.. బంతిపై చక్కని నియంత్రణ! ప్రత్యర్థి గోల్‌పోస్టుపై వరుస దాడులు! ఇవన్నీ చూస్తే విజయం భారత్‌దే అనిపించింది. కానీ ఆఖర్లో పట్టు వదిలి.. ప్రత్యర్థికి అవకాశం ఇచ్చిన ఛెత్రిసేన ఓటమి చవిచూసింది. అఫ్గానిస్థాన్‌తో ప్రపంచకప్‌ ఆసియా క్వాలిఫయర్స్‌లో భారత్‌ ఆటతీరిది. మంగళవారం గ్రూప్‌-ఏ పోరులో 1-2 గోల్స్‌తో తన కన్నా తక్కువ ర్యాంకు జట్టు అఫ్గానిస్థాన్‌ చేతిలో కంగుతింది. దీంతో 150వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సునీల్‌ ఛెత్రికి చేదు అనుభవం తప్పలేదు. ఛెత్రి భారత్‌కు ఆధిక్యాన్ని అందించినా.. పేలవ డిఫెన్స్‌, సమన్వయ లోపంతో విజయాన్ని దూరం చేసుకుంది. 38వ నిమిషంలో దక్కిన పెనాల్టీని కెప్టెన్‌ సద్వినియోగం చేయడంతో భారత్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ద్వితీయార్థంలోనూ దూకుడుతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టింది. అయితే ఆఖర్లో పట్టు సడలింది. డిఫెన్స్‌లో లోపాలు కనిపించాయి. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ అఫ్గాన్‌ ఆటగాడు రహ్మద్‌ అక్బరీ (70వ నిమిషం) గోల్‌ కొట్టి స్కోరు సమం చేశాడు. దాదాపు ఆఖరిదాకా రెండు జట్లు మరో గోల్‌ చేయలేకపోవడంతో మ్యాచ్‌ డ్రా అవుతుందేమో అనిపించింది. అయితే 88వ నిమిషంలో పెనాల్టీని షరీఫ్‌ గోల్‌గా మలిచి అఫ్గాన్‌ను గెలిపించాడు.  ప్రస్తుతం 4 మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు ఓటములు, ఓ డ్రాతో 4 పాయింట్లతో ఉన్న భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. జూన్‌ 6న కువైట్‌.. 11న ఖతార్‌తో మ్యాచ్‌ల్లో భారత్‌ నెగ్గితేనే మూడో రౌండ్‌ చేరేందుకు అవకాశాలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని