స్టార్క్‌ ఉరుమై.. సాల్ట్‌ పిడుగై!

ఐపీఎల్‌-17లో హ్యాట్రిక్‌ విజయాలతో అదిరే ఆరంభం చేసినా.. గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో కంగుతిన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మళ్లీ గెలుపు పట్టాలెక్కింది.

Updated : 15 Apr 2024 04:31 IST

లఖ్‌నవూపై కోల్‌కతా గెలుపు 

ఐపీఎల్‌-17లో హ్యాట్రిక్‌ విజయాలతో అదిరే ఆరంభం చేసినా.. గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో కంగుతిన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మళ్లీ గెలుపు పట్టాలెక్కింది. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను బంతితో చుట్టేసి.. బ్యాట్‌తో అదరగొట్టేసి ఓ సూపర్‌ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో సాల్ట్‌.. బౌలింగ్‌లో స్టార్క్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఎల్‌ఎస్‌జీపై కేకేఆర్‌ గెలవడమిదే తొలిసారి.
కోల్‌కతా
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి మళ్లీ గెలుపు బాట పట్టింది. ఆదివారం ఈడెన్‌గార్డెన్స్‌లో మొదట లఖ్‌నవూ 161/7కే పరిమితమైంది. నికోలాస్‌ పూరన్‌ (45; 32 బంతుల్లో 2×4, 4×6) టాప్‌ స్కోరర్‌. మిచెల్‌ స్టార్క్‌ (3/28) ప్రత్యర్థిని కట్టడి చేశాడు. ఛేదనలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఫిల్‌ సాల్ట్‌ (89 నాటౌట్‌; 47 బంతుల్లో 14×4, 3×6) మెరుపులతో లక్ష్యాన్ని కోల్‌కతా 15.4 ఓవర్లలోనే 2 వికెట్లే కోల్పోయి అందుకుంది.

సాల్ట్‌ ధనాధన్‌: కోల్‌కతా ఛేదనలో సాల్ట్‌ ఆటే హైలైట్‌. పవర్‌ప్లేని సమర్థంగా ఉపయోగించుకున్న అతడు.. లఖ్‌నవూ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఒకవైపు సునీల్‌ నరైన్‌ (6), రఘువంశీ (7) త్వరగా ఔటైనా.. కోల్‌కతా చింత పడలేదంటే కారణం ఈ ఓపెనరే! బంతిని గాల్లోకి లేపకుండా గ్రౌండ్‌ షాట్లే ఆడుతూ సాల్ట్‌ లక్ష్యాన్ని కరిగించాడు. కృనాల్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టిన అతడు.. షమార్‌ జోసెఫ్‌ వేర్వేరు ఓవర్లలో రెండు మెరుపు సిక్స్‌లు అందుకోవడంతో 10 ఓవర్లకు 101/2తో కోల్‌కతా స్కోరు దూసుకెళ్లింది. 26 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్న సాల్ట్‌.. సమీకరణాన్ని (57 బంతుల్లో 54) తేలిక చేశాడు. అర్ధసెంచరీ తర్వాత అతడు మరింత ధాటిగా ఆడాడు. 42 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో అతడు యశ్‌ ఠాకూర్‌ వేసిన 14వ ఓవర్లో మూడు ఫోర్లు.. తర్వాత 15వ ఓవర్లో ఫోర్‌, సిక్స్‌ దంచడంతో లక్ష్యం 30 బంతుల్లో 6 పరుగులుగా మారింది. ఆ తర్వాతి ఓవర్లోనే కోల్‌కతా ఛేదన పూర్తయింది. కేకేఆర్‌ 26 బంతులు ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. సాల్ట్‌కు చక్కటి సహకారం అందించిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (38 నాటౌట్‌) ఆఖరిదాకా నిలిచి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అభేద్యమైన మూడో వికెట్‌కు సాల్ట్‌-శ్రేయస్‌ 120 పరుగులు జత చేశారు.

లఖ్‌నవూ కట్టడి: అంతకుముందు మందకొడి పిచ్‌పై లఖ్‌నవూకు స్టార్క్‌ కళ్లెం వేశాడు. ఆరంభంలో స్వింగ్‌ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేశాడు. మొదట రాహుల్‌.. చివర్లో పూరన్‌ రాణించకపోతే ఆ జట్టు పోరాడే స్కోరు కూడా చేసేది కాదు. 39కే 2 వికెట్లు కోల్పోయిన లఖ్‌నవూను రాహుల్‌.. ఆయుష్‌ బదోని (29)తో కలిసి నడిపించాడు. తన శైలిలో ఆఫ్‌ సైడ్‌ చక్కని షాట్లు ఆడిన రాహుల్‌ స్కోరు పెంచాడు. అయితే మధ్య ఓవర్లలో నరైన్‌ (1/17), వరుణ్‌ చక్రవర్తి (1/30) కట్టుదిట్టంగా బంతులు వేయడంతో లఖ్‌నవూకు తేలిగ్గా పరుగులు రాలేదు. పైగా రాహుల్‌తో పాటు దీపక్‌ హుడా (8), బదోని, స్టాయినిస్‌ (10) వికెట్లు పడ్డాయి. ఈ స్థితిలో దూకుడుగా ఆడిన పూరన్‌ లఖ్‌నవూ స్కోరు పెంచాడు. వైభవ్‌ అరోరా వేసిన 18వ ఓవర్లో అతడు రెండు సిక్స్‌లతో సహా 18 పరుగులు రాబట్టాడు. అయితే ఆఖరి ఓవర్‌ను పొదుపుగా బౌలింగ్‌ చేసిన స్టార్క్‌.. పూరన్‌, అర్షద్‌ (5) వికెట్లు పడగొట్టి 6 పరుగులే ఇచ్చాడు.

లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) నరైన్‌ (బి) వైభవ్‌ 10; రాహుల్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) రసెల్‌ 39; దీపక్‌ హుడా (సి) రమణ్‌దీప్‌ (బి) స్టార్క్‌ 8; బదోని (సి) రఘువంశీ (బి) నరైన్‌ 29; స్టాయినిస్‌ (సి) సాల్ట్‌ (బి) వరుణ్‌ 10; పూరన్‌ (సి) సాల్ట్‌ (బి) స్టార్క్‌ 45; కృనాల్‌ నాటౌట్‌ 7; అర్షద్‌ఖాన్‌ (బి) స్టార్క్‌ 5; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 161; వికెట్ల పతనం: 1-19,   2-39, 3-78, 4-95, 5-111, 6-155, 7-161; బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-28-3; వైభవ్‌ అరోరా 3-0-34-1; హర్షిత్‌ రాణా 4-0-35-0; నరైన్‌ 4-0-17-1; వరుణ్‌ చక్రవర్తి 4-0-30-1; రసెల్‌ 1-0-16-1

కోల్‌కతా ఇన్నింగ్స్‌: సాల్ట్‌ నాటౌట్‌ 89; నరైన్‌ (సి) స్టాయినిస్‌ (బి) మోసిన్‌ 6; రఘువంశీ (సి) రాహుల్‌ (బి) మోసిన్‌ 7; శ్రేయస్‌ అయ్యర్‌ నాటౌట్‌ 38; ఎక్స్‌ట్రాలు 22 మొత్తం: (15.4 ఓవర్లలో 2 వికెట్లకు) 162; వికెట్ల పతనం: 1-22, 2-42; బౌలింగ్‌: షమార్‌ జోసెఫ్‌ 4-0-47-0; మోసిన్‌ఖాన్‌ 4-0-29-2; కృనాల్‌ పాండ్య 1-0-14-0; యశ్‌ ఠాకూర్‌ 2-0-25-0; అర్షద్‌ఖాన్‌ 2-0-24-0; రవి బిష్ణోయ్‌ 2.4-0-17-0


షమార్‌.. ప్చ్‌

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిలో పడ్డ వెస్టిండీస్‌ యువ పేసర్‌ షమార్‌ జోసెఫ్‌కు తన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లో చేదు అనుభవం తప్పలేదు. ఆదివారమే లీగ్‌లో అరంగేట్రం చేసిన అతను బాగా తడబడ్డాడు. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్లో ఏకంగా 22 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇందులో 2 వైడ్స్‌, 2 నోబాల్స్‌ కూడా ఉన్నాయి. ఈ ఓవర్‌ ఆరో బంతిని అతడు అయిదుసార్లు వేశాడు. మొదట నోబాల్‌.. తర్వాత రెండు వైడ్లు, తర్వాత నోబాల్‌.. ఆ తర్వాత సిక్స్‌.. ఇలా సాగింది అతడి బౌలింగ్‌. మొత్తంగా 4 ఓవర్లలో 47  పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా  తీయలేకపోయాడీ కరీబియన్‌ కుర్రాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని