Shubhaman Gill : టీమ్‌ఇండియాను కాపాడిన శుభ్‌మన్ స్టన్నింగ్ క్యాచ్‌..

ఒక్క క్యాచ్‌ మ్యాచ్‌ గతినే మార్చేస్తుంది. అలాంటిది తమ జట్టును గెలింపించేలా ఇన్నింగ్స్‌ ఆడుతున్న బ్యాటర్‌ క్యాచ్‌ అయితే ...

Updated : 23 Aug 2022 12:43 IST

ఇంటర్నెట్ డెస్క్: ఒక్క క్యాచ్‌ మ్యాచ్‌ గతినే మార్చేస్తుంది. అలాంటిది తమ జట్టును గెలింపించేలా ఇన్నింగ్స్‌ ఆడుతున్న బ్యాటర్‌ క్యాచ్‌ అయితే మరీ కీలకం. అటువంటి క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసి పడితే.. శభాష్‌ అని అభినందించకుండా ఉండలేం. జింబాబ్వే-భారత్‌ జట్ల మధ్య జరిగిన ఆఖరి వన్డేలో శుభ్‌మన్‌ గిల్ ఇలాంటి సూపర్‌ క్యాచ్‌ను పట్టి టీమ్‌ఇండియాకు ఓటమి గండం తప్పించాడు. అప్పటికే సెంచరీ చేసిన సికిందర్ రజా (115) ధాటిగా ఆడుతూ జింబాబ్వేను విజయతీరాలకు చేర్చేలా కనిపించాడు. శార్దూల్ ఠాకూర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 49వ ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించాడు. అయితే.. బౌండరీ లైన్‌ వద్ద శుభ్‌మన్‌ గిల్ అద్భుతంగా స్పందించి క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో జింబాబ్వే ఓటమిపాలై క్లీన్‌స్వీప్‌ అయిపోయంది.

జింబాబ్వేతో మూడో వన్డేలో భారత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (130) శతకం సాధించి కీలకంగా మారాడు. ఇషాన్ కిషన్‌ (50) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 289/8 స్కోరు సాధించింది. అనంతరం జింబాబ్వే 276 పరుగులకు ఆలౌటై 13 పరుగుల తేడాతో ఓడింది. తన కెరీర్‌లోనే తొలి సెంచరీ సాధించిన శుభ్‌మన్‌ గిల్ ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అలానే మూడు వన్డేల్లో 245 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌ను కూడా అందుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం గిల్ మాట్లాడుతూ.. ‘‘నా ఇన్నింగ్స్‌లో డాట్‌ బంతులు తక్కువ ఉండేలా ప్రయత్నించా. బంతిని బలంగా హిట్‌ చేయకుండా టైమింగ్‌తో ఆడా. శతకం సాధించడం ఎప్పుడూ ప్రత్యేకమే. మూడుసార్లు 90ల్లోనే పెవిలియన్‌కు చేరా. అందుకే ఈసారి ఎలాగైనా సెంచరీగా మార్చాలని కృతనిశ్చయంతో ఆడాను. ఈ శతకం నా తొలి కోచ్‌ అయిన మా నాన్నకు అంకితమిస్తున్నా’’ అని వెల్లడించాడు.

సచిన్‌ రికార్డు బద్దలు

ఈ క్రమంలో గిల్ అరుదైన రికార్డును సాధించాడు. జింబాబ్వేపై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన భారత ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమ్‌ఇండియా దిగ్గజం సచిన్ పేరిట ఉండేది. 1998లో బులవాయో వేదికగా జింబాబ్వేతో జరిగిన వన్డేలో సచిన్‌ 127 పరుగులు సాధించి  అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 130 పరుగులు సాధించిన గిల్‌.. సచిన్‌ 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని