Hardik Pandya : కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య..!

టీమ్‌ఇండియా ఆల్‌ రౌండర్ హర్దిక్ పాండ్య వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది! ఐపీఎల్ - 2022 సీజన్‌ నుంచి లక్నో, అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీలు కొత్తగా పొట్టి క్రికెట్లోకి...

Published : 11 Jan 2022 01:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్య వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది! ఐపీఎల్ -2022 సీజన్‌ నుంచి లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీలు కొత్తగా పొట్టి క్రికెట్లోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. వీటిలో అహ్మదాబాద్ ఫ్రాంఛైజీకి హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన హార్దిక్‌ పాండ్యకు దేశవాళీ క్రికెట్‌లో బరోడా జట్టు తరఫున ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే సీజన్ నుంచి హార్దిక్‌ పాండ్య అహ్మదాబాద్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.

వచ్చే సీజన్‌ కోసం ముంబయి ఇండియన్స్‌ జట్టు యాజమాన్యం.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్‌లను రిటెయిన్‌ చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో ఘోరంగా విఫలమైన హార్దిక్‌ పాండ్యను ముంబయి యాజమాన్యం వదులుకుంది. దీంతో పాండ్య బహిరంగ వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 92 మ్యాచులు ఆడిన హార్దిక్‌ పాండ్య 153.91 స్ట్రైక్ రేట్‌తో 1,476 పరుగులు చేశాడు. 42 వికెట్లు పడగొట్టాడు. గత కొద్దికాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న హార్దిక్‌ పాండ్య.. టీ20 ప్రపంచకప్‌ ముగిసినప్పటి నుంచి ఒక్క అంతర్జాతీయ మ్యాచులోనూ ఆడలేదు. మరోవైపు, అఫ్ఘానిస్థాన్ ఆల్‌ రౌండర్ రషీద్‌ ఖాన్‌, ముంబయి ఇండియన్స్ వికెట్ కీపర్‌ ఇశాన్‌ కిషన్‌లను కూడా వేలంలో అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవాలని చూస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని