Hardik pandya: టీమ్‌ఇండియాపై మైఖేల్‌ వాన్‌ కామెంట్స్‌.. పాండ్యా సమాధానం ఇదే

టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా హార్దిక్‌ పాండ్యా స్పందించాడు.

Published : 17 Nov 2022 01:09 IST

దిల్లీ: టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తామని.. అయితే భారత జట్టుకు కొత్తగా రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కౌంటర్‌ ఇచ్చాడు. 

‘‘మన ప్రదర్శన సరిగా లేనప్పుడు కచ్చితంగా ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తుంటారు. అందులో తప్పేం లేదు. మేం వాటిని గౌరవిస్తాం. కానీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న టీమ్ఇండియా వంటి జట్టు ఈరోజు కొత్తగా ఒకరి దగ్గర రుజువు చేసుకోవలసిందేమి లేదు. ఇది ఒక క్రీడ. ప్రతిసారి మరింత బాగా ఆడగలిగేలా ప్రయత్నించాలి. ఫలితం దానికదే వస్తుంది. మా పొరపాట్లను సరిదిద్దుకునే విధంగా కృషి చేస్తున్నాం. ప్రపంచకప్‌ ఫలితం నిరాశపరిచింది. కానీ మేం ప్రొఫెషనల్‌ ఆటగాళ్లం. జయాపజయాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. తప్పులు సరిదిద్దుకుంటూ మరింత మెరుగవుతాం’’ అంటూ హర్దిక్‌ పాండ్యా తెలిపాడు. 

‘‘వైట్‌బాల్‌ చరిత్రలోనే అత్యంత పేలవమైన జట్టుగా టీమ్‌ఇండియా నిలిచింది. వాళ్లకున్న ప్రతిభకు టీ20 క్రికెట్‌ ఎలా ఆడగలరని నేను ఆశ్చర్యపోయాను. వారి దగ్గర గొప్పగా ఆడేవారున్నారు. కానీ జట్టు ఆర్డర్‌ సరిగా లేదు. లేదంటే పవర్‌ప్లే మొదటి 5 ఓవర్లలోనే ఇంగ్లిష్‌ ఆటగాళ్లను స్థిరపడనిచ్చేవారా? ఆ విషయంపై టీమ్‌ఇండియా దృష్టి పెట్టాల్సిందే’’అంటూ మైఖేల్‌ ఇటీవల ఓ మీడియా కథనంలో పేర్కొన్నాడు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని