Arshdeep Singh: ఉమ్రాన్‌తో పోటీ లేదు.. అతడుంటే నాకే ప్రయోజనం: అర్ష్‌దీప్‌

జట్టులో ఇద్దరు యువ ఫాస్ట్‌ బౌలర్లు ఉంటే.. పోటీ ఉండటం సహజం.. అయితే ఉమ్రాన్‌, తన మధ్య అలాంటి వాతావరణం ఏమీ ఉండదని యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ తెలిపాడు.

Published : 29 Nov 2022 17:40 IST

ఇంటర్నెట్ డెస్క్: అర్ష్‌దీప్‌ సింగ్‌ మీడియం పేసర్.. ఉమ్రాన్‌ మాలిక్‌ ఫాస్ట్‌కే ఫాస్ట్‌ బౌలర్‌. వీరిద్దిరి మధ్య సహజంగానే జట్టులో స్థానం కోసం పోటీ ఉంటుంది. కానీ ఉమ్రాన్‌ ఓ ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేయడం వల్ల తనకు ఎంతో ప్రయోజనమని అర్ష్‌దీప్‌ చెప్పడం విశేషం. ఎందుకంటే ఒకరేమో 130 కి.మీ వేగంతో బంతిని సంధిస్తే.. మరొకరు నిలకడగా 150 కి.మీ విసిరి బ్యాటర్లను ఇబ్బందికి గురి చేస్తారు. వీరిద్దరూ న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్నారు. వన్డే అరంగేట్రం కూడా ఒకేసారి చేయడం విశేషం. ఈ క్రమంలో ఉమ్రాన్‌ మాలిక్‌తో బౌలింగ్‌ చేయడంపై అర్ష్‌దీప్‌ స్పందించాడు. 

‘‘ఉమ్రాన్‌తో కలిసి బౌలింగ్‌ చేయడం ఎప్పుడూ బాగుంటుంది. అలాగే డ్రెస్సింగ్‌రూమ్‌లోనూ వాతావరణం సరదాగా ఉంది. సహచర బౌలర్‌గా ఉమ్రాన్‌ నుంచి నాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నేను, ఉమ్రాన్‌ వరుసగా ఓవర్లు వేయడం వల్ల బ్యాటర్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్రాన్‌ 150 కి.మీ వేగంతో బంతులేస్తాడు. నేనేమో 130-135 కి.మీ వేగంతో సంధిస్తా. పేస్‌లో మార్పు వల్ల ప్రత్యర్థి బ్యాటర్‌ అయోమయానికి గురవుతాడు. మేమిద్దరం దీర్ఘకాలం ఇలానే బౌలింగ్‌ భాగస్వామ్యం కొనసాగిస్తాం. టీ20లతో పోలిస్తే వన్డేల్లో బౌలింగ్‌ వేయడం కాస్త డిఫరెంట్‌. పొట్టి ఫార్మాట్‌లో మొదట్లో ఎటాకింగ్‌ బౌలింగ్‌ చేస్తే.. చివర్లో ప్రత్యర్థులు పరుగులు చేయనీయకుండా వేయాల్సి ఉంటుంది’’ అని అర్ష్‌దీప్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని