T20 World Cup: పొట్టికప్‌ అందిస్తే.. పాక్‌కు బాబర్‌ ప్రధాని అవుతాడు: గావస్కర్

పొట్టికప్‌ ఫైనల్‌ దశకు చేరింది. ఆదివారం పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య టైటిల్‌ ఫైట్‌ జరగనుంది. సెమీఫైనల్‌ మ్యాచుల్లో న్యూజిలాండ్‌పై పాక్‌.. భారత్‌పై ఇంగ్లాండ్‌ విజయం సాధించి తుదిపోరుకు చేరిన విషయం తెలిసిందే.

Updated : 12 Nov 2022 15:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సరిగ్గా 30 ఏళ్ల కిందట వన్డే ప్రపంచకప్‌ను ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వంలోని పాకిస్థాన్‌ సొంతం చేసుకొంది. అప్పుడు తొలి మ్యాచ్‌లో ఓడిపోయి ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ 2022లోనూ పాక్‌ తన తొలి మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓడిపోయింది. అనూహ్య పరిస్థితుల్లో సెమీస్‌కు చేరిన పాక్‌.. అక్కడ న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. టైటిల్‌ కోసం ఆదివారం ఇంగ్లాండ్‌తో తలపడబోతోంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇంతకీ గావస్కర్‌ ఏం చెప్పాడంటే..?

గత గురువారం భారత్‌Xఇంగ్లాండ్‌ జట్ల మధ్య రెండో సెమీస్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు సునిల్‌ గావస్కర్ ఓ క్రీడా ఛానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘బాబర్ అజామ్‌ నాయకత్వంలోని పాక్‌ టైటిల్‌ను గెలిస్తే.. 2048లో అతడు పాక్‌కు ప్రధాని అవుతాడు’’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఎందుకంటే 1992లో పాక్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇమ్రాన్‌ ఖాన్ 2018లో ప్రధాని అయిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్లపాటు పదవిని అనుభవించిన ఇమ్రాన్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో దిగిపోయాడు. ప్రపంచకప్‌ను గెలిపించిన 26 ఏళ్ల తర్వాత ఇమ్రాన్‌ ప్రధాని అయ్యాడని.. ఇప్పుడు కూడా బాబర్‌ టైటిల్‌ను అందిస్తే 2048లో పాక్‌ ప్రధాని పదవిని చేపట్టే అవకాశం ఉందనేది గావస్కర్‌ వ్యాఖ్యల సారాంశం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని