Ishan - Dhoni: ధోనీ ఘనతలో 70 శాతం సాధించినా ఆనందమే: ఇషాన్‌ కిషన్‌

బంగ్లాదేశ్‌పై అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించి ఔరా అనిపించిన ఇషాన్‌ కిషన్‌ను భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీతో అభిమానులు పోల్చడం ప్రారంభించారు. ఎందుకంటే ఇద్దరూ ఒకే రాష్ట్రం నుంచి వచ్చినవారే కాకుండా దూకుడుగా ఆడటంలో ముందుంటారు.

Published : 27 Dec 2022 01:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇద్దరూ ఝార్ఖండ్‌ నుంచి వచ్చినవారే.. ఒకరేమో టీమ్‌ఇండియాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఐసీసీ ప్రపంచకప్‌లను అందించిన మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ కాగా.. దూకుడైన ఆటతీరుతో అభిమానుల మనస్సును కొల్లగొట్టిన యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్. వీరిద్దరూ కీపర్లే కావడం విశేషం. ఇటీవల బంగ్లాదేశ్‌పై ఇషాన్‌ డబుల్‌ సెంచరీతో అబ్బురపరిచాడు. ఈ క్రమంలో క్రికెట్‌ దిగ్గజంతో కిషన్‌ను పోలుస్తూ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో హోరెత్తించారు. ఇలా తనను ధోనీతో పోల్చడంపై ఇషాన్‌ ఆనందం వ్యక్తం చేస్తూనే.. అంతటి స్థాయికి చేరుకోవడానికి  ఇంకా సమయం పడుతుందని వెల్లడించాడు. 

‘‘నేను గిల్‌క్రిస్ట్‌ బ్యాటింగ్‌ను, వికెట్ కీపింగ్‌ను ఇష్టపడతా. ఇక ధోనీ భాయ్‌ను మైదానంలోనూ, వెలుపల చూశా. నిశ్శబ్దంగా ఉంటూ అందరితో కలివిడిగా ఉండే అతడి క్యారెక్టర్‌ నుంచి నేర్చుకొనేందుకు చాలా విషయాలు ఉన్నాయి. జీవితంలో ఇవే చాలా కీలకంగా మారతాయి. గొప్ప ఆటగాళ్ల నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఇలాంటి అంశాలే. నన్ను ధోనీ వంటి దిగ్గజంతో పోల్చడం నాకు బాగానే ఉంటుంది. నేను కూడా పాజిటివ్‌గా తీసుకొంటా. ఇలా స్టార్‌తో పోలుస్తున్నారంటే నాలోనూ ఏదో టాలెంట్‌ ఉందని అనిపిస్తుంటుంది. అందుకే ధోనీ సాధించిన ఘనతల్లో కనీసం 70 శాతం వరకు చేసినా నాకు ఆనందమే. ఎందుకంటే అతడి నాయకత్వంలోనే చాలా రోజుల తర్వాత వన్డే ప్రపంచకప్‌తోపాటు తొలి టీ20 వరల్డ్‌ కప్‌ను సగర్వంగా ఎత్తుకోగలిగాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా జట్టును గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’ అని ఇషాన్‌ తెలిపాడు.

ఇషాన్‌నే ఓపెనర్‌గా పంపాలి: బ్రెట్‌ లీ

వన్డేలు, టీ20ల్లో ఓపెనర్‌గా విఫలమైన కేఎల్‌ రాహుల్‌ స్థానంలో టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా పంపించాలని ఆసీస్ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ బ్రెట్‌లీ సూచించాడు. ‘‘వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ భారత్‌ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా తన ఓపెనర్‌ స్లాట్‌ను ఇషాన్‌ కిషన్‌తో భర్తీ చేయాలి. ఇది జరుగుతుందా..? అంటే నేను చెప్పలేను. కానీ ఇషాన్‌ అయితే సరైన బ్యాటర్‌ అని మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఇటీవలే అత్యంత వేగవంతమైన డబుల్‌ సెంచరీని సాధించిన విషయం మరిచిపోకూడదు. ఇలానే నిలకడగా ఆడుతూ.. ఫిట్‌గా ఉంటే మాత్రం ఓపెనర్‌గా ఇషాన్‌ను బరిలోకి దింపాల్సిందే’’ అని బ్రెట్‌లీ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని