IND vs ENG: వారికి ‘బజ్‌బాల్‌’ ఉంటే.. మనకు ‘విరాట్‌బాల్‌’: క్రికెట్ దిగ్గజం

టెస్టుల్లో తలపడేందుకు భారత్, ఇంగ్లాండ్‌ (IND vs ENG) జట్లు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి హైదరాబాద్‌ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Published : 21 Jan 2024 18:09 IST

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే గురువారం నుంచి భారత్ - ఇంగ్లాండ్‌ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. టెస్టుల్లోనూ దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థులకు ఇంగ్లిష్‌ జట్టు వణుకు పుట్టిస్తోంది. గత యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడినప్పటికీ ఇంగ్లాండ్‌ ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. పుంజుకొని మరీ విజయమే లక్ష్యంగా ఆఖరి మూడింట్లో తలపడింది. రెండు విజయాలు నమోదు చేసి.. మరొక దానిని డ్రా ముగించింది. దీంతో సిరీస్‌ సమమైంది. ఇప్పుడు మరోసారి బజ్‌బాల్ (BazBall) క్రికెట్‌ రుచి చూపించేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఇంగ్లాండ్‌ బజ్‌బాల్ క్రికెట్‌ ఆడితే.. టీమ్‌ఇండియా వద్ద మరో ఆయుధం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli) రూపంలో ‘విరాట్ బాల్’ గేమ్‌తో ఇంగ్లాండ్‌కు కౌంటర్‌ ఇస్తామని పేర్కొన్నాడు.

‘‘విరాట్ బ్యాటింగ్‌ తీరు అద్భుతంగా ఉంది. మంచి ఫామ్‌లో ఉన్నాడు. అందుకే నమ్మకంగా చెబుతున్నా ‘బజ్‌ బాల్‌’కు విరాట్ బాల్‌తో కౌంటర్‌ ఇస్తాం. ఇప్పటి వరకు 113 టెస్టుల్లో 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారీ స్కోర్లుగా ఎలా మలచాలో కోహ్లీకి బాగా తెలుసు. ఇంగ్లాండ్‌ గత రెండేళ్లుగా కొత్త విధానంతో ఆడుతోంది. దూకుడే లక్ష్యంగా వారి బ్యాటింగ్‌ సాగుతోంది. పరిస్థితి ఏంటనేది కాకుండా ఎటాకింగ్‌ ఆడేస్తారు. ఇప్పుడు ఇదే ఆటతీరు భారత్‌ వేదికగా జరగబోయే టెస్టు సిరీస్‌లోనూ వర్కౌట్‌ అవుతుందో లేదో చూడాలి. మరీ ముఖ్యంగా స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది’’ అని గావస్కర్‌ తెలిపాడు. 

సూపర్ ఫామ్‌లో విరాట్: ఇర్ఫాన్‌ పఠాన్

‘‘విరాట్ కోహ్లీ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. భారత అభిమానులకు శుభవార్త. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ సూపర్‌ టచ్‌లో కనిపించాడు. క్లిష్టమైన పిచ్‌లపై అనుభవంతో ఆడాడు. పాదాల కదలిక కూడా బాగుంది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ భారీ స్కోర్లు చేస్తాడనే నమ్మకముంది’’ అని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్‌లో మరో 152 పరుగులు చేస్తే టెస్టుల్లో 9వేల పరుగుల మైలురాయిని అందుకొన్న నాలుగో భారత బ్యాటర్‌గా కోహ్లీ నిలుస్తాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని