IND vs PAK: భారత్‌, పాక్‌ మ్యాచ్‌.. నేనైతే ఎక్కువ డబ్బు డిమాండ్ చేసేవాడిని: క్రిస్ గేల్

రానున్న వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌, ఇంగ్లాండ్, పాకిస్థాన్‌, న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుతాయని వెస్టిండీస్ స్టార్‌ క్రిస్ గేల్  (Chris Gayle)అంచనా వేశాడు. అంతేకాదు భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Published : 29 Jun 2023 23:36 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో వన్డే ప్రపంచ కప్‌ (World Cup 2023) జరగనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఇటీవల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. అక్టోబర్‌ 5న ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌  మ్యాచ్‌తో ఈ మహా సమరం మొదలుకానుంది. అహ్మదాబాద్‌ వేదికగా నవంబర్‌ 19న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది. ఈ మెగా టోర్నీలో ఏఏ జట్లు సెమీ ఫైనల్‌ చేరుతాయనే అంశంపై ఇప్పటి నుంచే పలువురు క్రికెటర్లు విశ్లేషణలు చేస్తున్నారు. భారత్‌, ఇంగ్లాండ్, పాకిస్థాన్‌, న్యూజిలాండ్ ఈ సారి సెమీస్‌కు చేరుతాయని వెస్టిండీస్ స్టార్‌ క్రిస్ గేల్ అంచనా వేశాడు. అక్టోబర్‌ 15న  అహ్మదాబాద్‌లో భారత్‌, పాక్‌ మధ్య జరిగే హై హోల్టేజీ  మ్యాచ్ గురించి కూడా క్రిస్‌ గేల్ (Chris Gayle) మాట్లాడాడు. 

ఇండియా, పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌ జరిగినప్పుడల్లా, ముఖ్యంగా ప్రపంచ కప్‌లో ఈ జట్లు ఆడినప్పుడు నిర్వాహకులకు ఆదాయం భారీగా సమకూరుతుందని చెప్పాడు. ఈ ఒక్క మ్యాచ్‌ ద్వారా ఐసీసీ ఈవెంట్‌కు అయ్యే మొత్తం ఖర్చు వస్తుందని పేర్కొన్నాడు. భారత్‌, పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఎక్కువ డబ్బు డిమాండ్‌ చేయాలని, ఎందుకంటే ఆ మ్యాచ్‌ ద్వారా అధిక ఆదాయం వస్తుందన్నాడు. తానైతే ఐసీసీ, బోర్డును నియంత్రించనని, ఒకవేళ భారత్‌, పాక్‌ ఆటగాళ్ల స్థానంలో తాను ఉంటే ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తానని (నవ్వుతూ) అన్నాడు. భారత్‌తోపాటు వెస్టిండీస్‌ చాలా కాలంగా ఐసీసీ ట్రోఫీని గెలవలేదని, స్వదేశంలో ఆడుతూ ఫేవరెట్‌గా బరిలోకి దిగే టీమ్‌ఇండియాపై ఒత్తిడి ఉంటుందని క్రిస్‌ గేల్ చెప్పాడు. 

మూడు పెద్ద దేశాలు.. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్‌లో ఎక్కువ భాగం ఆడటం వల్ల ఆటకు నష్టం చేకూరుతుందని వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ క్రికెట్ అభివృద్ధి చెందాలంటే వెస్టిండీస్ వంటి చిన్న బోర్డుల ఆటగాళ్లకు మెరుగైన వేతనం చెల్లించాలని క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు. “ఇంతకుముందుతో పోలిస్తే ప్రస్తుతం క్రికెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఇది పెద్ద వ్యాపారంగా మారిపోయింది.  టీ20 లీగ్‌లతోనే కాకుండా టెస్టు క్రికెట్‌తోనూ చాలా డబ్బు వస్తోంది. చిన్న జట్ల కంటే పెద్ద జట్లకు ఎక్కువ ఆదాయం లభిస్తోంది. ఈ విధానంలో మార్పు రావాలి. ప్రతి జట్టు సమాన ప్రయోజనాలు పొందాలి.  వెనుకబడిన, తక్కువ ర్యాంక్‌లో ఉన్న జట్లు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మరిన్ని మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరముంది. ఆయా జట్ల కోసం మౌలిక సదుపాయాలను కల్పించాలి. పెద్ద జట్ల మాదిరిగానే చిన్న జట్ల ఆటగాళ్లకూ ఎక్కువ వేతనం ఇవ్వాలి’’అని క్రిస్‌ గేల్ అన్నాడు. 

నవంబర్‌లో ఇండియన్‌ వెటరన్‌ ప్రీమియర్ లీగ్  

ఇదిలా ఉండగా.. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) మొదటి సీజన్‌ నవంబర్ 17, 2023 నుంచి ప్రారంభం కానుంది. ఈ వెటరన్ లీగ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, సనత్ జయసూర్య, క్రిస్ గేల్, సురేష్ రైనా వంటి దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటారు. ఈ టోర్నమెంట్‌ను ఇండియన్ వెటరన్స్ క్రికెట్ బోర్డు,  ఇండియన్ పవర్ క్రికెట్ అకాడమీ నిర్వహిస్తాయి. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఒక్కో టీమ్‌లో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు, కనీసం ఐదుగురు మాజీ రంజీ ట్రోఫీ క్రికెటర్లు ఉండేలా నిబంధనలు రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని