india vs south africa: సచిన్‌ రికార్డును సమం చేసిన విరాట్.. దక్షిణాఫ్రికా లక్ష్యం 327

india vs south africa: వన్డే ప్రపంచకప్‌లో (ICC Cricket World Cup 2023) భాగంగా భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా 327 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు ముందుంచింది.

Updated : 05 Nov 2023 18:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ 101* (121 బంతుల్లో 10 ఫోర్లు) శతకంతో అదరగొట్టిన వేళ భారత జట్టు 327 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. పుట్టిన రోజున కోహ్లీ వన్డేల్లో తన 49వ శతకాన్ని పూర్తి చేసుకోవడం విశేషం. దీంతో సచిన్‌ రికార్డు (49)ను సమం చేశాడు. విరాట్‌తోపాటు శ్రేయస్‌ అయ్యర్ 77 (87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు. ఆఖర్లో సూర్యకుమార్‌ యాదవ్ (22: 14 బంతుల్లో 5 ఫోర్లు), జడేజా (29; 15 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌) దూకుడుగా ఆడేశారు. 

అద్భుత భాగస్వామ్యం..

ఓపెనర్లు రోహిత్ శర్మ (40), శుభ్‌మన్‌ గిల్ (23) తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. రోహిత్ ఔటైన కాసేపటికే గిల్ కూడా పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించడంతో పరుగుల రాక కష్టంగా మారింది. దీంతో విరాట్-శ్రేయస్‌ ఆచితూచి ఆడారు. మూడో వికెట్‌కు 134 పరుగులు జోడించారు. కానీ, మరోసారి సఫారీ జట్టు బౌలర్లు పుంజుకోవడంతో శ్రేయస్‌తోపాటు కేఎల్ రాహుల్ (8) పెవిలియన్‌కు చేరారు. కానీ, విరాట్-సూర్య దూకుడు ఆడి స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. సూర్య ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన జడేజా కూడా వేగంగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కోహ్లీ శతకం పూర్తి చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు ఎంగిడి, జాన్‌సెన్, రబాడ, కేశవ్, షంసీ తలో వికెట్ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని