IND vs PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు వందే భారత్‌ ప్రత్యేక రైళ్లు!

వన్డే ప్రపంచకప్‌ (ODI WC 2023)లో భాగంగా భారత్‌-పాక్‌ (IND vs PAK) మ్యాచ్‌ చూసేందుకు అహ్మదాబాద్‌ వెళ్లాలనుకునే వారికి భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. మ్యాచ్‌ రోజున వివిధ ప్రాంతాల నుంచి వందే భారత్‌ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

Updated : 06 Oct 2023 13:15 IST

అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్‌(ODI World Cup 2023) ప్రారంభమైంది. అయితే.. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబరు 14న అహ్మదాబాద్‌(Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) వేదికగా భారత్‌-పాకిస్థాన్‌ (IND vs PAK)లు తలపడనున్నాయి. దాయాది దేశాల మధ్య పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అహ్మదాబాద్‌కు రానున్నారు. ఈ క్రమంలో అక్కడి హోటళ్లకు డిమాండ్ పెరిగింది. మరోవైపు మ్యాచ్‌ జరిగే రోజు వివిధ నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన టికెట్‌ ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్‌ అభిమానులకు భారతీయ రైల్వే (Indian Railway) శుభవార్త చెప్పింది.

భారత్‌-పాక్‌ మ్యాచ్ జరిగే రోజున మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్‌ రైళ్ల (Vande Bharat Trains)ను నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. త్వరలోనే రైళ్ల షెడ్యూల్‌, టికెట్ ధరల వివరాలు వెల్లడిస్తామన్నారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా అహ్మదాబాద్‌లోని హోటళ్ల ధరలు భారీగా పెరగడం, అధిక విమాన టికెట్‌ ధరలు వంటి వాటి నుంచి ఉపశమనం కలిగించేందుకు వందే భారత్‌ ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించినట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు జాతీయ వార్త సంస్థకు వెల్లడించారు. 

ఆసియా క్రీడల్లో భారత్‌ vs పాక్‌ తలపడతాయా?

మ్యాచ్‌ ప్రారంభం కావడానికి కొన్నిగంటల ముందు ఈ ప్రత్యేక రైళ్లు సబర్మతీ, అహ్మదాబాద్ స్టేషన్లకు చేరుకుంటాయని తెలిపారు. ఈ రెండు స్టేషన్లు నరేంద్ర మోదీ స్టేడియానికి దగ్గరగా ఉండటంతో అభిమానులు సులభంగా స్టేడియానికి చేరుకోవచ్చన్నారు. అదేవిధంగా మ్యాచ్‌ ముగిసిన కొద్ది గంటల తర్వాత ఈ రైళ్లు అహ్మదాబాద్‌ నుంచి తిరిగి బయల్దేరుతాయని, దాని వల్ల అభిమానులు అదే రోజు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకోవచ్చని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని