ఐపీఎల్‌‌ కబుర్లు: ఏబీ వచ్చేయ్‌.. యువీ గుర్తుంది

ఇంటర్నెట్‌ డెస్క్‌ ఇండియన్‌ టీ20 లీగు ఆసక్తికరంగా సాగుతోంది. కోల్‌కతాపై విజయం సాధించిన బెంగళూరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అలాగే 33 బంతుల్లో 73* పరుగులు బాదేసిన ఏబీ డివిలియర్స్‌ను అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయాలన్న...

Updated : 15 Jan 2023 17:34 IST

ధోనీ కోసం ఆ అభిమాని ఏం చేశాడో తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ టీ20 లీగు ఆసక్తికరంగా సాగుతోంది. కోల్‌కతాపై విజయం సాధించిన బెంగళూరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అలాగే 33 బంతుల్లో 73* పరుగులు బాదేసిన ఏబీ డివిలియర్స్‌ను అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయాలన్న డిమాండ్లు మళ్లీ ఊపందుకున్నాయి. కొన్నిసార్లు అతడికి ఎలాంటి బంతులేయాలో తెలియదని డీకే అంటున్నాడు. ఇక ధోనీని విపరీతంగా ఇష్టపడే ఓ అభిమాని తమిళనాడులో ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ధోనీ అభిమాని ఇల్లు

క్రికెట్‌ ఆడే అనేక దేశాల్లో ఎంఎస్‌ ధోనీకి అభిమానులు ఉన్నారు. ఇక తమిళనాడు సంగతి చెప్పక్కర్లేదు. ‘తలా’ అంటూ అతడి ఆటను చూసేందుకు పడి చస్తారు. నెట్స్‌లో సాధన చేస్తున్నా వీక్షించేందుకు వేల సంఖ్యలో హాజరవుతారు. తమిళనాడు అరంగూర్‌లోని గోపీకృష్ణ అనే వ్యక్తి ధోనీపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన ఇంటికి పూర్తిగా పసుపు రంగు వేయించి, చెన్నై లోగో, ఎంఎస్‌ ధోనీ ఫొటోలను గీయించాడు. అంతేకాకుండా ఆ ఇంటికి ‘ధోనీ అభిమాని ఇల్లు’ అని పేరు పెట్టాడు. ఈ చిత్రాలను చెన్నై ట్విటర్లో పంచుకుంది.

ఏబీ.. టాటా చెప్పేసెయ్‌

కోల్‌కతా మ్యాచులో అదరగొట్టిన బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి అతడిని అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేయాలని కోరాడు. ‘రాత్రి చూసిందాన్ని నమ్మలేకపోతున్నా. ఉదయం నిద్రలేచిన తర్వాతా అలాంటి అనుభూతే ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రికెట్‌కు నీ అవసరం ఉంది. వీడ్కోలు నుంచి తిరిగొచ్చెయ్‌‌. అప్పుడు ఆట మరింత మెరుగవుతుంది’ అని ఏబీని శాస్త్రి తెగ పొగిడేశాడు.

సందడే సందడి

బెంగళూరు శిబిరంలో గెలుపు సందడి నెలకొంది. కోల్‌కతా మ్యాచ్‌ తర్వాత డ్రస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లందరూ సంతోషంగా గడిపారు. సంబరాలు చేసుకున్నారు. ఆడిన రెండు మ్యాచుల్లోనూ అదరగొట్టిన క్రిస్‌మోరిస్‌ను బెంగళూరు ప్రశంసించింది. 2 మ్యాచులాడిన అతడు 8 ఓవర్లు విసిరి 5 వికెట్లు తీశాడు. ఎకానమీ 4.5 మాత్రమే. ఇక ఏబీ డివిలియర్స్, విరాట్‌ కోహ్లీ మధ్య సోదరబంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఇండియన్‌ టీ20 లీగులో 3000+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. ‘సోదరబంధం 3000+కు చేరుకుంది’ అని ట్వీట్‌ చేసింది.

‘బాస్‌’కు నయమైంది‌

కల్తీ ఆహారం తిని అస్వస్థతకు గురైన పంజాబ్‌ ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ కోలుకున్నాడు. గురువారం బెంగళూరుతో జరిగే మ్యాచులో అతడు ఆడతాడని జట్టు వర్గాలు తెలిపాయి. సోమవారం సాయంత్రం నుంచే యూనివర్స్‌ బాస్‌ సాధన మొదలు పెట్టాడని తెలిసింది. అనారోగ్యం వల్లే గేల్‌ను హైదరాబాద్‌ మ్యాచులో ఆడించలేకపోతున్నామని ఆ జట్టు కోచ్‌ అనిల్‌ కుంబ్లే చెప్పిన సంగతి తెలిసిందే.

యూజీకి యువీ కౌంటర్‌

కోల్‌కతాపై విజయం తర్వాత తమ జట్టును అభినందిస్తూ బెంగళూరు ఆటగాడు యుజ్వేంద్ర చాహల్‌ ఓ ట్వీట్‌ పెట్టాడు. ‘సింఫనీతో రాగాలు పలికించాలంటే ఒక్కరే సరిపోరు. మొత్తం ఆర్కెస్ట్రా అవసరం. గొప్ప బృంద స్ఫూర్తి ప్రదర్శించాం’ అని అన్నాడు. ఇందుకు టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ తమాషాగా బదులిచ్చాడు. ‘నువ్వు ఎవరినీ చనిపోనివ్వకూడదు! చూస్తుంటే నేనే మళ్లీ మైదానానికి రావాల్సి వస్తుందేమో మరి! అద్భుతమైన బౌలింగ్‌.. యూజీ’ అని సరదాగా ప్రశంసించాడు. అయితే మూడు బంతుల్లో 3 సిక్సర్లు బాదడం తనకింకా గుర్తుందని యూజీ బదులిచ్చాడు.

360 ఆటగాడు.. ఎలా వేయగలం?

అత్యంత కష్టమైన పనినీ ఏబీ డివిలియర్స్‌ తేలిగ్గా చేసేస్తాడని కోల్‌కతా సారథి దినేశ్ కార్తీక్‌ అన్నాడు. తమతో జరిగిన మ్యాచులో ఆఖరి 5 ఓవర్లలో 80 పరుగులు చేయడం అంత సులభం కాదని పేర్కొన్నాడు. అయినా దానిని ఏబీ సులువైందిగా మార్చేశాడని ప్రశంసించాడు. ‘అద్భుతమైన ఆటగాడని ఎందుకు అతడిని ప్రశంసిస్తారో మరోసారి నిరూపించాడు. కొన్నిసార్లు అతడికి ఎలాంటి బౌలింగ్‌ చేయాలో తెలియదు. ఎందుకంటే అతడు క్రీజులో ఎట్నుంచి ఎటైనా కదలగలడు. కానీ ఈ సారి మాత్రం అతడు ఎడమకాలి సాయంతో బంతుల్ని స్టేడియం బయటకు పంపించాడు’ అని కార్తీక్‌ అన్నాడు.

సంతోషం సగం బలం

హైదరాబాద్‌ జట్టు సాయంత్రం చేసిన ట్వీట్‌ అభిమానులను అలరిస్తోంది. మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ నవ్వుతున్న చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. దానికి ‘సంతోషం సగం బలం’ అనే ట్యాగు జత చేశారు. గెలుపోటములు సహజమేనని, ఓడినా సంతోషంగా ఉంటేనే మళ్లీ గెలుపు పలకరిస్తుందని చెప్పకనే చెప్పారు! అని అభిమానులు అనుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని