MSD - KP: నేను తొలి వికెట్‌ కాదు.. ధోనీ మరో పదేళ్లు ఆడగలడు: పీటర్సన్

కెవిన్‌ పీటర్సన్, భారత క్రికెట్ అభిమానుల మధ్య సోషల్‌ మీడియా వేదిక సరదాగా మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. కెవిన్‌ కూడా ఇక్కడి అభిమానులతో కలిసి పోయి ట్వీట్లు, పోస్టులు చేస్తుంటాడు.

Updated : 17 May 2023 18:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) మరోసారి నెట్టింట వైరల్‌గా మారాడు. టీమ్‌ఇండియా మాజీ సారథి, సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్ ధోనీకి (MS Dhoni) సంబంధించిన వీడియోను పోస్టు చేశాడు. కెవిన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ధోనీ పెవిలియన్‌కు చేరాడు. ఆ వీడియోతోపాటు ధోనీ వేసిన బంతికి తాను ఔట్‌ కాలేదనే వీడియోనూ షేర్‌ చేశాడు. ధోనీ ఖాతాలో తాను తొలి వికెట్‌ కాదని నిరూపించేందుకే ఆ వీడియోను పోస్టు చేసినట్లు తెలిపాడు. అంపైర్‌ ఔట్ ఇచ్చినప్పటికీ.. డీఆర్‌ఎస్‌కు వెళ్లిన పీటర్సన్‌ నాటౌట్‌గా తేలాడు. అయితే, 2017 ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా ధోనీ సరదాగా మాట్లాడుతూ.. కెవిన్‌ పీటర్సన్ వికెట్ తనకు టెస్టుల్లో మొదటిదని చెప్పాడు. ఆ పక్కనే ఉన్న పీటర్సన్‌ ‘‘నేను మాజీ సారథి కంటే మంచి గోల్ఫర్‌ను’’ అని వ్యాఖ్యానించాడు. ఇరువురి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పీటర్సన్‌కు భారత అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. 

మరోసారి తాను నాటౌట్‌గా తేలిన వీడియోను పీటర్సన్ పోస్టు చేశాడు. అలాగే ఐపీఎల్‌లో ధోనీకి మరో పదేళ్లపాటు ఆడగల సత్తా ఉందని ఇటీవల వ్యాఖ్యానించాడు. ‘‘ప్రస్తుతం ఉన్న ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ప్రకారం.. మరో పదేళ్లు ధోనీ ఆడగలడు. అతడికి వికెట్ల వెనుక కాచుకోగల ఫిట్‌నెస్‌ ఉంది. ఎక్కువ సేపు బ్యాటింగ్‌ చేయకపోయినా.. చివర్లో దూకుడుగా సిక్స్‌లు కొట్టగల సత్తా ఉంది’’ అని పీటర్సన్ తెలిపాడు. మరోవైపు ఈ సీజనే ధోనీకి చివరిదిగా అంతా భావిస్తున్నారు. ధోనీ కూడా అప్పుడప్పుడు ఇలాంటి సంకేతాలు ఇవ్వడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని