MS Dhoni: ధోనీ ‘ఛేజింగ్‌ మంత్ర’ను అందరూ పాటించాలి: కెవిన్ పీటర్సెన్

ఎంఎస్ ధోనీలో (MS Dhoni) కేవలం నాయకత్వ పటిమే కాకుండా.. మంచి ఫినిషర్‌ ఉన్నాడని మనందరికీ తెలుసు. ఛేదన సమయంలో అతడిలోని ‘ఫినిషర్’ త్వరగా బయటకొస్తాడు. అలాంటి ధోనీని చూసి యువ బ్యాటర్లు నేర్చుకోవాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సూచించాడు.

Published : 27 Apr 2023 16:39 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023వ సీజన్‌లో కోల్‌కతా చేతిలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB vs KKR) 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లక్ష్య ఛేదన చివరి దశలో ఆర్‌సీబీ బ్యాటర్లు దూకుడుగా ఆడటంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సెన్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛేదన సమయంలో ఎంఎస్ ధోనీ ఎలా ఆడతాడో చూసి నేర్చుకోవాలని ఆర్‌సీబీ బ్యాటర్లకు సూచించాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ధోనీ ఛేదన మంత్రం పేరుగాంచిందని, చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టును ఎలా గెలిపించాలో అతడిని చూసి నేర్చుకోవాలని పేర్కొన్నాడు. 

‘‘ప్రత్యర్థి నిర్దేశించిన 200కిపైగా టార్గెట్‌ను ఛేదించే క్రమంలో మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లాలి. ఎంఎస్ ధోనీ ఇలా చాలాసార్లు తన జట్టును గెలిపించాడు. లోయర్‌ ఆర్డర్‌లో వచ్చి మ్యాచ్‌ను ఫినిష్‌ చేసేస్తాడు. ఎలాంటి సమయంలోనూ ఒత్తిడికి గురి కాకుండా.. కాస్త వీక్‌గా ఉన్న బౌలర్‌ను లక్ష్యంగా చేసుకుని బాదేస్తాడు. 18 లేదా 19 లేదా 20వ ఓవర్‌.. ఇలా ఏదైనా సరే వేచి చూడటం నేర్చుకోవాలి. ధోనీలా విరాట్ కోహ్లీ చివరి వరకు క్రీజ్‌లో ఉండి గెలిపిద్దామని భావించాడు. అయితే, అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.  అయితే, యువ బ్యాటర్లు చాలామంది రెండొందలకుపైగా టార్గెట్‌ను చూడగానే 12 లేదా 13వ ఓవర్‌లోనే ఛేదించి గెలిపించేయాలని చూస్తుంటారు. అక్కడే త్వరగా ఔటై వెళ్లిపోతున్నారు. ప్రత్యర్థి బౌలర్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు ఛేదన చాలా సులువుతుంది’’ అని పీటర్సెన్ తెలిపాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఇవాళ రాజస్థాన్‌తో జయపుర వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని