KL Rahul: ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ రూల్‌ ఉంటే అతడితో కచ్చితంగా బౌలింగ్‌ చేయించేవాడిని: కేఎల్‌

ఉత్కంఠభరితంగా సాగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ పోరాడి మరీ విజయం సాధించింది. మ్యాచ్‌ ముగిసేవరకు టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌తోపాటు అభిమానుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Published : 25 Dec 2022 17:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రవిచంద్రన్ అశ్విన్‌, శ్రేయస్‌ అయ్యర్ ఎనిమిదో వికెట్‌కు కీలకమైన 71 పరుగుల భాగస్వామ్యం నిర్మించడంతో.. బంగ్లాదేశ్‌పై ఉత్కంఠభరితంగా సాగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-0 తేడాతో కైవసం చేసుకొంది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన గంటలోపే కీలకమైన మూడు వికెట్లను కోల్పోవడంతో భారత శిబిరంలో టెన్షన్ పెరిగింది. చివరికి టీమ్‌ఇండియా విజయం సాధించడంతో కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌తోపాటు సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు. తమ డ్రెస్సింగ్‌ రూమ్‌లోని పరిస్థితి గురించి మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్‌ వెల్లడించాడు. అలాగే కుల్‌దీప్‌ యాదవ్‌ను ఎందుకు తీసుకోలేదో కూడా చెప్పాడు.

నిజం చెప్పాలంటే.. 

‘‘మిడిలార్డర్‌పై చాలా నమ్మకం ఉంది. తప్పకుండా మనల్ని గెలిపించడానికి కృషి చేస్తారని తెలుసు. ఇది గ్రహించడానికి ఇప్పటికే చాలా క్రికెట్ ఆడాం. కానీ నిజం చెప్పాలంటే మ్యాచ్‌ జరిగే కొద్దీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్‌ వాతావరణం కనిపించింది. బ్యాటింగ్ చేయడానికి ఇది చాలా క్లిష్టమైన వికెట్. బంగ్లా బౌలర్లు మమ్మల్ని తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. కొత్త బంతిని ఎదుర్కోవడం చాలా కష్టం. బంతి పాతబడే కొద్దీ పరుగులు రాబట్టేందుకు అవకాశం ఉంది. అందుకే కొత్త బంతిని ఆడేవారికి చాలా కష్టం. ఛేజింగ్‌లో మేం అనుకొన్నదానికంటే కాస్త ఎక్కువ వికెట్లను కోల్పోయాం. చివరికి మ్యాచ్‌ను గెలవడం ఆనందంగా ఉంది’’ 

కుల్‌దీప్‌ను తీసుకోకపోవడంపై.. 

‘‘ గత కొన్నేళ్లుగా మా బౌలింగ్‌ ఎటాక్‌ అద్భుతంగా ఉంది. విదేశాల్లోనూ బౌలర్లు ఉత్తమ ప్రదర్శనతో రాణించారు. అయితే బంగ్లాతో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్‌ లేని లోటు కనిపించింది. కానీ తొలి రోజు పిచ్‌ను పరిశీలిస్తే స్పిన్నర్లు, ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అనిపించింది. అందుకే కుల్‌దీప్‌ను తీసుకోలేకపోయా. అయితే ఐపీఎల్‌లో ప్రవేశపెట్టబోయే ‘ఇంపాక్ట్‌ ప్లేయర్’ పద్ధతి టెస్టుల్లోనూ ఉంటే బాగుండేది. ఎందుకంటే బంగ్లాతో రెండో టెస్టులో ఆ రూల్‌ ఉంటే కచ్చితంగా రెండో ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్‌ను బౌలింగ్‌కు తీసుకొచ్చేవాడిని. కుల్‌దీప్‌ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి నేనేమీ బాధపడటంలేదు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఫాస్ట్‌ బౌలర్లు ఎక్కువ వికెట్లు తీసిన సంగతిని మరిచిపోకూడదు. వన్డేల్లో ఆడిన అనుభవంతో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని వివరించాడు. మొదటి టెస్టులో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైన కుల్‌దీప్‌ను పక్కన పెట్టడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

రెండో టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్లవి కలిపి 37 వికెట్లు పడ్డాయి. అందులో ఒకటి రనౌట్‌ కాగా.. ఫాస్ట్‌ బౌలర్లు 11 వికెట్లు, స్పిన్నర్లు 25 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లను భారత ఫాస్ట్‌ బౌలర్లు (ఉమేశ్ 4, జయ్‌దేవ్ 4) తీశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు (సిరాజ్ 2, జయ్‌దేవ్ 1, ఉమేశ్ 1) తీశారు. కానీ భారత రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఏడు వికెట్లూ (మెహిదీ 5, షకిబ్ 2) బంగ్లా స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని