IPL - 2022 : జట్టు విజయవంతం కావాలంటే వాళ్లు ఉండాల్సిందే.! : కేఎల్‌ రాహుల్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌)లో విజయవంతం కావాలంటే మిడిల్ ఆర్డర్‌లో సత్తా చాటగల ఆటగాళ్లు జట్టులో ఉండాలని లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ అన్నాడు.  అప్పుడే ఓపెనర్లు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఉంటుందని...

Published : 24 Mar 2022 01:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌)లో విజయవంతం కావాలంటే మిడిల్ ఆర్డర్‌లో సత్తా చాటగల ఆటగాళ్లు జట్టులో ఉండాలని లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ అన్నాడు.  అప్పుడే ఓపెనర్లు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఉంటుందని అతడు పేర్కొన్నాడు. లఖ్‌నవూ జట్టుతో పాటు గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా ఈ సీజన్‌ నుంచే ఐపీఎల్‌లోకి తొలిసారి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే.

‘ఐపీఎల్‌లో చేసిన పరుగులను పరిగణనలోకి తీసుకున్నంత కాలం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే, గత 3-4 సీజన్‌లలో నేను మెరుగైన ప్రదర్శన చేశాను. జట్టు విజయవంతం కావాలంటే మిడిలార్డర్‌లో సత్తా చాటగల ఆటగాళ్లు ఉండాలి. అందుకే ఈ సారి వేలంలో మార్కస్‌ స్టోయినిస్‌, జేసన్‌ హోల్డర్‌, కృనాల్‌ పాండ్య, దీపక్‌ హుడా వంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నాం. మిడిల్, లోయర్ మిడిల్ ఆర్డర్ బలంగా ఉంటే.. ఓపెనర్లు దూకుడుగా ఆడేందుకు అవకాశం ఉంటుంది. ఓపెనర్లు పవర్‌ ప్లేలోనే వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు వీలుటుంది. అలా అని ఎప్పుడూ దూకుడుగా ఆడటం సరికాదు. పరిస్థితులను బట్టి ఒక్కోసారి నిలకడగానూ రాణించగలగాలి. కెప్టెన్‌గా నేను నేర్చుకున్న పాఠాల్లో ఇది ఒకటి. 130-140 పరుగుల మోస్తరు లక్ష్యం మన ముందున్నప్పుడూ.. 200 స్ట్రైక్ రేట్‌తో ఆడటంలో అర్థం లేదు. కెప్టెన్‌గా నేనెప్పుడూ జట్టు విజయం గురించే ఆలోచిస్తుంటాను. మా ఆటగాళ్లు కూడా గెలుపే లక్ష్యంగా ఆడేలా ప్రోత్సహిస్తాను. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే మాకు ముఖ్యం’ అని కేఎల్ రాహుల్ చెప్పాడు. మార్చి 28న లఖ్‌నవూ జట్టు గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని