Wrestlers Protest: మేరీకోమ్‌ కమిటీకే రెజ్లింగ్ సమాఖ్య బాధ్యతలు

మహిళా రెజ్లర్లపై వేధింపుల ఆరోపణలపై కేంద్రం కమిటీని నియమించింది. దీనికి కూడా ప్రముఖ బాక్సర్‌ మేరీకోమ్‌(Mary Kom) నేతృత్వం వహిస్తారని తెలిపింది. 

Published : 23 Jan 2023 17:23 IST

దిల్లీ: మహిళా రెజర్ల(wrestlers)పై వేధింపుల ఆరోపణల విషయంలో కీలక నిర్ణయం వెలువడింది. లైంగిక వేధింపుల ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు కేంద్రం పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రముఖ బాక్సర్‌, రాజ్యసభ మాజీ సభ్యురాలు మేరీకోమ్(Mary Kom) నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఇకనుంచి నెల రోజులు భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) రోజువారీ వ్యవహారాలను ఈ కమిటీ చూసుకుంటుంది.

అధ్యక్షుడితో పాటు సమాఖ్యపై వివిధ ఆరోపణలు చేస్తూ దేశ అగ్రశ్రేణి రెజ్లర్లు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మూడు రోజుల పాటు ధర్నా చేయడం సంచలనంగా మారింది. క్రీడల మంత్రితో గత శుక్రవారం జరిపిన చర్చల అనంతరం రెజ్లర్లు ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే.. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఆదివారం నిర్వహించ తలపెట్టిన అత్యవసర సర్వసభ్య మండలి సమావేశం రద్దయింది. విచారణ ముగిసేంతవరకూ సమాఖ్య కార్యకలాపాలను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ నిషేధించిన సంగతి తెలిసిందే. విచారణ ముగిసేంతవరకూ ఈ వ్యవహారాలకు దూరంగా ఉండాలని భూషణ్‌ను ఆదేశించింది. కానీ శనివారం యూపీ(UP)లోని నందిని నగర్‌లో రెజ్లింగ్‌(Wrestling) పోటీలకు అతను హాజరు కావడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (IOA)ఏడుగురు సభ్యులతో ఇదివరకే కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో  మేరీ కోమ్‌(Mary Kom)తోపాటు డోలా బెనర్జీ, అలక్‌నంద అశోక్‌, యోగేశ్వర్‌ దత్‌, సహదేవ్‌ యాదవ్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని