IND vs ENG: ఘోర ఓటమి.. మా జట్టుకు నిజాయతీ అవసరం: ఇంగ్లాండ్‌పై మాజీ కెప్టెన్‌ తీవ్ర వ్యాఖ్యలు

ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 1-4 తేడాతో (IND vs ENG) ఘోర ఓటమిని చవిచూసింది. భారత్‌ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి మరీ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 11 Mar 2024 10:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ చేతిలో 1-4 తేడాతో ఇంగ్లాండ్‌ (IND vs ENG) ఓడిపోవడంపై ఆ జట్టు మాజీ క్రికెటర్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. మాజీ క్రికెటర్ అలిస్టర్‌ కుక్‌ తన టీమ్‌ను వెనుకేసుకొని రాగా.. మాజీ కెప్టెన్ మైకెల్‌ వాన్‌ మాత్రం విమర్శలు గుప్పించాడు. ఈ ఘోర ఓటమిపై నిజాయతీగా సమీక్షించుకోవాలని.. ఆటగాళ్లలో కొందరు జట్టు కొత్త సంప్రదాయానికి అలవాటుపడలేదని వ్యాఖ్యానించాడు. ఐదో టెస్టులో మరీ ఘోరంగా ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోవడం తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని తెలిపాడు. 

‘‘భారత పర్యటనలో ఎదురైన ఘోర పరాభవంపై ఇంగ్లాండ్‌ జట్టు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదీనూ నిజాయతీగా ఎక్కడ తప్పులు చేశామనేది సమీక్షించుకోవాలి. అలానే చేస్తుందని భావిస్తున్నా. ప్రతి అంశంపైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ఇదే విధంగా కాకుండా.. ఇంకాస్త ఉత్తమంగా ఆటను కొనసాగిస్తే మంచిది. వారు ఇప్పుడు ప్రయత్నిస్తున్న ఫార్మాలాను (బజ్‌బాల్ క్రికెట్‌) నేను గౌరవిస్తా. ప్రతి రోజూ మ్యాచ్‌ను చూసేలా చేయగలిగారు. ప్రపంచంలో ఎలాంటి జట్టునైనా ఓడించగల సత్తా ఉన్న ఇంగ్లాండ్‌కు పెద్ద సిరీసుల్లో పరాజయం కావడం తీవ్ర నిరుత్సాహానికి గురి చేసే అంశం. మరీ ముఖ్యంగా బ్యాటింగ్‌ విభాగంలో ఘోర వైఫల్యం కనిపిస్తోంది. ఇంకా కొందరు ఆటగాళ్లు జట్టు కొత్త సంప్రదాయానికి అలవాటు పడలేకపోయారు. ఉల్లాసంగా ఉంటూనే కష్టపడే జట్టుగా అందరూ భావిస్తున్నారు. కానీ, డ్రెస్సింగ్‌ రూమ్‌లో అలాంటి పరిస్థితి లేదనిపిస్తోంది. అందుకే, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.  

ప్రతిసారీ జట్టు సభ్యులను వెనుకేసుకు రావడం సరైన పద్ధతి కాదు. కాస్త కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బయట నుంచి చూడటానికి బాగుందనిపిస్తుంది. సానుకూలత ప్రదర్శించడం మంచిదే. కానీ, జట్టు విజయాలపై ప్రభావం పడితే ఒక్కోసారి అదే కష్టంగా మారుతుంది. అందుకే, కొన్నిసార్లు నిజాయతీ కూడా అవసరం. జట్టుకు పంపే సందేశంపై ఎవరూ అనుమానం పడరు. ఎక్కడ తప్పు జరిగింది? ఎలా దానిని సరిదిద్దుకోవాలనే అంశాలపై దృష్టిసారించాలి. సహచరులు, కోచింగ్‌ సిబ్బంది చర్చించుకుంటే డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం చెడిపోదు. ఇంగ్లాండ్‌ మేనేజ్‌మెంట్ కూడా ఆటగాళ్లకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చింది. అబుదాబిలో ప్రాక్టీస్‌ సెషన్స్‌ ఏర్పాటు చేసింది. బెంగళూరులో గోల్ఫ్‌ను ఆటవిడుపుగా ఆడారు. నేనేమీ పాతకాలంలా టెస్టు సిరీస్‌కు ముందు మూడు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాలని చెప్పను. అదంతా గతం. అవసరం లేదు కూడానూ. అయితే, సుదీర్ఘమైన బ్రేక్‌లు వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా మ్యాచ్‌లు నిర్వహిస్తే బాగుండేది. తుది జట్టుపై ఓ అంచనా రావడానికి అవెంతో కీలకంగా మారతాయి’’ అని మైకెల్ వాన్‌ వ్యాఖ్యానించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని