
సెప్టెంబర్ 12 గుర్తుంచుకోండి!
మైక్ టైసన్ రీ ఎంట్రీ రోజది
ఇంటర్‌నెట్ డెస్క్: ‘ఐయామ్ బ్యాక్’ అని మైక్‌టైసన్ ఎప్పుడైతే ట్వీట్ చేశాడో అప్పట్నుంచి అభిమానుల్లో ఒకటే ఆత్రుత! ఐరన్ మైక్, భూమ్మీద అత్యంత చెడ్డ మనిషి మళ్లీ బాక్సింగ్ రింగులోకి ఎప్పుడు దిగుతాడా అని ఎదురుచూస్తున్నారు. ఆయన ప్రత్యర్థి ఎవరు?రీ ఎంట్రీ ఎప్పుడు? ఎక్కడ? అనే వివరాల కోసం ఆరాటపడ్డారు. అయితే టైసన్ బౌట్ ఎప్పుడో తెలిసిపోయింది.
డబ్ల్యూబీఏ, డబ్ల్యూబీసీ, ఐబీఎఫ్ టైటిళ్లను సాధించిన ఈ హెవీ వెయిట్ బాక్సర్ సెప్టెంబర్ 12న రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఫోర్ డివిజన్ ప్రపంచ విజేత రాయ్ జోన్స్ జూనియర్‌తో తలపడనున్నాడు. డిగ్నిటీ హెల్త్ స్పోర్ట్స్ పార్క్‌లో ఈ ఫైట్ ఉండనుందని తెలిసింది. ఒకప్పుడు టైసన్ దేహం ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే కనిపిస్తోంది! తనను తాను ఎంతో మార్చుకున్నాడు. 54 ఏళ్ల వయసులోనూ విపరీతంగా శ్రమించాడు. కసరత్తులు చేశాడు. పంచ్ విసిరితే.. భీకరమైన శక్తి విడుదలవుతోంది!
ప్రత్యర్థి రాయ్ జోన్స్ జూనియర్ సైతం తక్కువేమీ కాదు. వరుసగా ఏడు బెల్ట్‌లు కైవసం చేసుకొని రికార్డు సృష్టించాడు. మిడిల్ వెయిట్, సూపర్ మిడిల్ వెయిట్, లైట్ హెవీవెయిట్‌లో విజేతగా అవతరించాడు. 2003లో హెవీవెయిట్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. 106 ఏళ్ల తర్వాత మిడిల్ వెయిట్ నుంచి వచ్చి హెవీ వెయిట్ గెలిచిన ఘనత అందుకున్నాడు. ప్రస్తుతం అతడి వయసు 51. లెజెండ్స్ బౌట్‌కు సంబంధించి శారీరకంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని టైసన్, రాయ్ అంటున్నారు.