MS Dhoni: కోర్టులో ఎంఎస్ ధోనీ ఫిర్యాదు.. మాజీ బిజినెస్‌ పార్టనర్ అరెస్ట్‌

ఎంఎస్ ధోనీని మోసం చేసిన కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. రాంచీ కోర్టులో అతడు చేసిన ఫిర్యాదుపై స్పందించారు.

Updated : 11 Apr 2024 13:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ధోనీ మాజీ బిజినెస్‌ పార్టనర్‌ మిహిర్‌ దివాకర్‌ను జైపుర్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనుమతి లేకుండా తన పేరును క్రికెట్ అకాడమీల కోసం వాడుకొన్నారని రాంచీ జిల్లా కోర్టులో మూడు నెలల కిందటే దివాకర్‌తోపాటు సౌమ్యా దాస్‌పై ధోనీ ఫిర్యాదు చేశాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు జైపుర్‌లో దివాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్కా స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అతడు డైరెక్టర్‌గా ఉన్నారు. సౌమ్యా దాస్‌ ఆచూకీ ఇంకా తెలియదు.

అసలేం జరిగిందంటే?

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అకాడమీలను ఏర్పాటు చేయడానికి ధోనీతో దివాకర్‌కు చెందిన ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌ సంస్థ 2017లో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఆర్కా స్పోర్ట్స్‌.. ఫ్రాంఛైజీ ఫీజులు, లాభాల్లో వాటాను క్రికెటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఒప్పందంలోని షరతులను పాటించడంలో అతడి కంపెనీ విఫలమైంది. దీనిపై ఆర్కా స్పోర్ట్స్‌కు చెందిన మిహిర్‌ దివాకర్‌, సౌమ్య దాస్‌తో చర్చించినా ఫలితం లేకపోవడంతో.. ఆ ఒప్పందం నుంచి ధోనీ వైదొలిగాడు. 2021 ఆగస్టు 15న ఆర్కా స్పోర్ట్స్‌కు ఇచ్చిన అథారిటీ లెటర్‌ను కూడా రద్దు చేసుకున్నాడు. అనంతరం పలుమార్లు లీగల్‌ నోటీసులు పంపించారు. అయినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోనీ కోర్టును ఆశ్రయించాడు. మిహిర్‌ దివాకర్‌, సౌమ్యపై రాంచీ కోర్టులో క్రిమినల్‌ కేసు దాఖలు చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆర్కా స్పోర్ట్స్‌ చేసిన మోసం కారణంగా ధోనీకి రూ.15కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. దీంతో వారిద్దరిపై క్రిమినల్‌ కేసు నమోదైంది. ధోనీ క్రికెట్‌ అకాడమీ పేరుతో ఆర్కా స్పోర్ట్స్‌ దేశంలో పలు చోట్ల అకాడమీలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని