Rohit Sharma: ఆ నిర్ణయం రోహిత్ తీసుకుంటే చాలు: ముంబయి కోచ్

ఐపీఎల్‌ (IPL) మెగా టోర్నీ ముగిసిన తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఉంది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్‌శర్మ విషయంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక సూచనలు చేశాడు. వాటిపై ముంబయి ఇండియన్స్ కోచ్ స్పందించాడు.  

Updated : 30 Apr 2023 19:49 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లోని (IPL) కొన్ని మ్యాచ్‌లకు ముంబయి సారథి రోహిత్‌ శర్మ విశ్రాంతి తీసుకోవాలని, అప్పుడే ఉత్సాహంగా ఉంటాడని టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. ఈ ఐపీఎల్‌ టోర్నీ ముగిశాక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ తగినంత విశ్రాంతి తీసుకోవాలని సన్నీ సూచించాడు. రోహిత్ విషయంలో గావస్కర్‌ చేసిన సూచనలపై ముంబయి ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్ స్పందించాడు.

‘‘రోహిత్ విశ్రాంతి తీసుకుంటాడని అనుకోవడం లేదు. అది నాకు సంబంధించిన విషయం కూడా కాదు. అయితే, మేం మాత్రం రోహిత్ ఆడాలని కోరుకుంటాం. టాప్‌ ప్లేయర్‌ మాత్రమే కాకుండా మా జట్టు కెప్టెన్. ఒకవేళ రోహిత్ విశ్రాంతి తీసుకోవాలని భావించి..ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిశీలిస్తాం. తగిన నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటి వరకు రోహిత్ అలా చేయలేదు. కాబట్టి, తప్పకుండా మిగతా మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండి ఆడతాడని భావిస్తున్నాం’’ అని బౌచర్ తెలిపాడు. 

డెత్‌ ఓవర్లలో...

డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించడంపై లోతుగా చర్చించామని బౌచర్ వెల్లడించాడు. ‘‘మ్యాచ్‌లో ఎక్కువ భాగం డామినేట్‌ చేసినా, డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాం. వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఇలాగే జరిగింది. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. దాని మీద తీవ్రంగా కసరత్తు చేసి సమస్యను పరిష్కరించుకుంటాం’’ అని బౌచర్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని