IND vs ENG: హైదరాబాద్‌లో తొలి టెస్టు.. రోహిత్‌ శర్మకు భారత దిగ్గజం కీలక సూచన

భారత్‌, ఇంగ్లాండ్ (IND vs ENG) మధ్య జనవరి 25న తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు దిగ్గజం ఆటగాడు సునీల్ గావస్కర్‌ కీలక సూచనలు చేశాడు. 

Published : 22 Jan 2024 18:55 IST

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమ్ఇండియా ఇప్పుడు మరో జట్టుతో టెస్టు సమరానికి సిద్ధమవుతోంది. జనవరి 25 నుంచి స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (2023-25)లో భారత్‌కిది కీలక సిరీస్. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్‌, ఇంగ్లాండ్ (IND vs AFG)ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే దాదాపు ఇరుజట్ల ఆటగాళ్లు హైదరాబాద్‌ చేరుకుని ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)కు దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) పలు కీలక సూచనలు చేశాడు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించని పక్షంలో బౌలర్లను తెలివిగా రొటేట్‌ చేసుకోవాలన్నాడు.

‘‘కెప్టెన్‌గా రోహిత్ శర్మ తన బౌలర్లను తెలివిగా ఉపయోగించుకోవాలి. సాధారణంగా ఉప్పల్ పిచ్‌పై తగినంత టర్న్ లభించదు. కాబట్టి ఒకవేళ ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి లంచ్ బ్రేక్‌ సమయానికి శుభారంభాన్ని అందుకుంటే టీమ్ఇండియా సారథి తన బౌలర్లను ఎలా వినియోగించుకుంటాడో చూడాలి. గత పర్యటనలో ఇంగ్లాండ్‌తో చెన్నైలో జరిగిన టెస్టులో రోహిత్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై ఎలా బ్యాటింగ్ చేయాలో చూపించాడు. అతడు అదేవిధంగా బ్యాటింగ్ చేస్తే భారత్‌కు మంచి ఆరంభం లభిస్తుంది. అదే జరిగితే తర్వాత వచ్చే బ్యాటర్లు కూడా స్వేచ్ఛగా ఆడతారు’’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో టీమ్ఇండియాకు గొప్ప రికార్డు ఉంది. అయిదు టెస్టులు ఆడి నాలుగు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించి ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని