NZ vs SL: శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం

వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న న్యూజిలాండ్.. కీలక మ్యాచ్‌లో అదరగొట్టింది. శ్రీలంకతో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Updated : 09 Nov 2023 20:11 IST

బెంగళూరు: వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న న్యూజిలాండ్.. కీలక మ్యాచ్‌లో అదరగొట్టింది. శ్రీలంకతో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 172 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్‌ ఐదు వికెట్లు కోల్పోయి 23.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు డేవాన్ కాన్వే (45; 42 బంతుల్లో 9 ఫోర్లు), రచిన్‌ రవీంద్ర (42; 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) శుభారంభం అందించారు. కేన్ విలియమ్సన్ (14), మార్క్‌ చాప్‌మన్ (7) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాటపట్టాడు. డారిల్‌ మిచెల్ (43; 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.

గ్లెన్ ఫిలిప్స్ (17*), టామ్‌ లేథమ్ (2*) నాటౌట్‌గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్ 2, మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో విజయం అందుకున్న కివీస్ నెట్‌రన్‌రేట్‌ (0.922) మరింత మెరుగుపర్చుకుంది. పాకిస్థాన్‌ (0.036), అఫ్గాన్‌ (-0.338) నెట్‌రన్‌రేట్‌, ఎనిమిది పాయింట్లతో ఇంకా సెమీస్ రేసులో ఉన్నాయి. అఫ్గాన్‌.. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. పాకిస్థాన్‌.. ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. ఈ రెండు జట్లు ఆయా మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తే చివరి బెర్తుని దక్కించుకోవచ్చు. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి 46.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. టాప్‌ ఆర్డర్‌లో ఓపెనర్ కుశాల్ పెరీరా (51; 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో విరుచుకుపడి 22 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మిగతా ఆటగాళ్లు పాథుమ్ నిశాంక (2), కుశాల్ మెండిస్ (6), సదీరా సమరవిక్రమ (1), చరిత్ అసలంక (8) వరుసగా పెవిలియన్ బాటపట్టారు. ఏంజెలో మాథ్యూస్ (16), ధనంజయ డిసిల్వా (19), కరుణరత్నె (6), దుష్మంత చమీరా (1) పరుగులు చేశారు. 128 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయిన లంక.. మహీశ్‌ తీక్షణ (39*), దిల్షాన్‌ మదుశంక (19) పోరాడటంతో కాస్త గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3,  ఫెర్గూసన్ 2, మిచెల్ శాంట్నర్ 2, రచిన్‌ రవీంద్ర 2, టిమ్ సౌథీ ఒక వికెట్ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని