Sunil Gavaskar: ధోనీ కాదు.. ‘అతడే అసలైన కెప్టెన్‌ కూల్’: సునీల్ గావస్కర్‌

సాధారణంగా భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (MS Dhoni)ని అభిమానులు ‘కెప్టెన్‌ కూల్‌’ అని పిలుస్తారు. అయితే, టీమ్‌ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్‌ మరో ఆటగాడిని ‘ఒరిజినల్ (అసలైన) కెప్టెన్‌ కూల్’ అని సంబోధించాడు.

Published : 26 Jun 2023 11:00 IST

ఇంటర్నెట్ డెస్క్: మైదానంలో ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా ఉంటూ జట్టును ముందుండి నడిపించే వాడు భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni). బౌలర్లు భారీగా పరుగులిచ్చినా అతడు కోప్పడిన సందర్భాలు చాలా అరుదు. అందుకే అభిమానులు, క్రీడా పండితులు అతడిని ‘కెప్టెన్‌ కూల్’ అని పిలుస్తుంటారు. అయితే, టీమ్‌ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) మరో ఆటగాడిని ‘ఒరిజినల్ (అసలైన) కెప్టెన్‌ కూల్’ అని సంబోధించాడు. ఇంతకీ ఆ ఆటగాడేవరో కాదు టీమ్‌ఇండియాకు మొట్టమొదటిసారి ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్‌ కపిల్ దేవ్‌ (Kapil Dev). 1983 ప్రపంచకప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా (Team India) కపిల్  సారథ్యంలో ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్‌ కెప్టెన్‌గా రాణించడంతోపాటు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

‘‘1983 ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్ బ్యాటింగ్‌లో రాణించడంతోపాటు బంతితోనూ అదరగొట్టాడు. ఫైనల్‌లో (వెస్టిండీస్‌తో) అతడు వివి రిచర్డ్స్‌ క్యాచ్‌ను అందుకున్న సంగతిని మర్చిపోకూడదు. ఫార్మాట్‌కు అవసరమైన విధంగా కపిల్‌దేవ్‌ కెప్టెన్సీ డైనమిక్‌గా ఉండేది. ఎవరైన క్యాచ్‌ను వదిలేసినా లేదా మిస్‌ ఫీల్డ్ చేసినా కోప్పడకుండా చిరునవ్వుతో ఉండేవాడు. ఈ విధానమే అతడిని ‘ఒరిజినల్ (అసలైన) కెప్టెన్‌ కూల్‌’గా చేసింది’’ అని సునీల్ గావస్కర్‌ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ ఫైనల్‌లో మంచి ఊపుమీదున్న వివి రిచర్డ్స్‌ (33; 28 బంతుల్లో 7 ఫోర్లు) మదన్‌లాల్ బౌలింగ్‌లో కపిల్‌దేవ్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో పెవిలియన్‌ చేరాడు.

కపిల్‌ డెవిల్స్‌.. దేశానికి మొట్టమొదటి క్రికెట్‌ ప్రపంచకప్‌ను అందించి సరిగ్గా 40 ఏళ్లవుతోంది. 1983 జూన్‌ 25న ఫైనల్‌లో బలమైన విండీస్‌ను ఓడించి టీమ్‌ఇండియా తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. 28 ఏళ్ల తర్వాత మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో 2011లో భారత్‌ రెండోసారి ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో ధోనీ సిక్సర్‌ బాది టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన క్షణాలు అభిమానుల కళ్లముందు ఇప్పటికీ కదలాడుతుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని