Worldcup 2023: ఓటమి తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌కు మోదీ..

ODI Worldcup 2023: ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమితో నిరాశలో ఉన్న టీమ్‌ఇండియా ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు ప్రధాని మోదీ (PM Modi) నిన్న డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లారు. వారికి మద్దతుగా నిలిచారు.

Updated : 20 Nov 2023 16:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ టోర్నీ (ODI Worldcup 2023)లో అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్‌ (Final)కు చేరిన టీమ్‌ఇండియా (Team India).. చివరి పరీక్షలో విఫలమవడంతో మెగా కప్పు కల చెదిరిపోయింది. గతరాత్రి ఫైనల్‌ మ్యాచ్‌ (IND vs AUS)లో ఓటమి.. భారత ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేక టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి క్షణాల్లో నిరాశలో కూరుకుపోయిన మన జట్టుకు భరోసానిచ్చి, ఉత్సాహపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లారు. ఆటగాళ్లను ఓదార్చారు.

ఈ విషయాన్ని ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సోషల్‌మీడియాలో వెల్లడిస్తూ.. ప్రధానితో ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ‘‘ఈ గొప్ప టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ.. మేం నిరాశతో ముగించాం. నిన్నటి ఫలితంతో మా గుండె బద్దలైంది. కానీ, మీ మద్దతుతోనే మేం ముందుకు సాగగలుగుతున్నాం. ప్రధాని మోదీ నిన్న మా డ్రెస్సింగ్‌ రూమ్‌కు రావడం చాలా ప్రత్యేకంగా అన్పించింది. ఎంతో ప్రేరణనిచ్చింది’’ అని జడ్డూ రాసుకొచ్చాడు. అటు షమీ కూడా మరో ఫొటోను షేర్‌ చేస్తూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. మళ్లీ బలంగా తిరిగొస్తామని పేర్కొన్నాడు.

మైదానంలో నిశ్శబ్దానికి కారణాలెన్నో..!

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రధాని మోదీ వీక్షించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌తో కలిసి ప్రధాని ఈ మ్యాచ్‌ను వీక్షించారు. అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇస్తూ అభినందించారు. ఆస్ట్రేలియా సారథి కమిన్స్‌కు వీరిద్దరూ ట్రోఫీని అందజేశారు.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత రోహిత్‌ సేనకు మద్దతు పలుకుతూ ప్రధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. ‘‘డియర్‌ టీమ్‌ఇండియా, ఈ ప్రపంచ కప్‌లో మీ ప్రతిభ, సంకల్పం గుర్తుంచుకోదగినది. గొప్ప స్ఫూర్తితో ఆడి.. దేశానికి గర్వకారణంగా నిలిచారు. మేమంతా ఈరోజు, ఎప్పటికీ మీ వెంటే ఉంటాం’’ అని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని