Punjab vs Hyderabad: హైదరాబాద్‌ బ్యాటింగ్‌ త్రయం.. మళ్లీ ‘పంజా’ విసిరేనా?

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ ఐదో మ్యాచ్‌ ఆడనుంది. పంజాబ్‌ను తన సొంత మైదానంలో ఢీకొట్టేందుకు సిద్ధమైంది.

Updated : 09 Apr 2024 16:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గత రెండు సీజన్లకు భిన్నంగా ప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్‌లో హైదరాబాద్‌ దూకుడు కొనసాగుతోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించింది. చెన్నై, ముంబయి వంటి పటిష్ఠమైన జట్లను ఓడించింది. బ్యాటింగ్‌ విధ్వంసం.. బౌలింగ్‌ మెరుపులతో అదరగొట్టేస్తున్న హైదరాబాద్‌ ఇవాళ పంజాబ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. 

ముల్లాన్‌పుర్‌లోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌ కోసం పంజాబ్, హైదరాబాద్‌ జట్లు సమాయత్తమయ్యాయి. ప్లే ఆఫ్స్ రేసులో ముందు ఉండాలంటే ప్రతీ మ్యాచ్‌ ఫలితం కీలకమే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ ఐదు, పంజాబ్‌ ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఇరు జట్లూ తలపడిన మ్యాచుల్లో హైదరాబాద్‌దే ఆధిపత్యం. 21 మ్యాచుల్లో సన్‌రైజర్స్ 14 గెలవగా.. పంజాబ్ ఏడింట్లోనే గెలిచింది. చివరిసారిగా 2023 సీజన్‌లో ఉప్పల్‌ వేదికగా తలపడిన మ్యాచ్‌లో హైదరాబాద్‌నే విజయం వరించింది. ఇప్పుడు అన్ని విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తుండటంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. 

హెడ్‌.. ‘క్లాస్‌’న్‌.. అభి‘షేక్’

హైదరాబాద్‌ జట్టులో బ్యాటింగ్‌ త్రయం అద్భుతాలు సృష్టిస్తోంది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్, అభిషేక్ శర్మ దూకుడైన ఆరంభం ఇస్తుండగా.. మిడిలార్డర్‌లో క్లాసెన్ వీరబాదుడుతో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. కోల్‌కతా, ముంబయిపై క్లాసెన్ (63, 80*) అదరగొట్టగా.. హార్దిక్‌ సేనపై హెడ్ (62), అభిషేక్ శర్మ(63) భారీ హిట్టింగ్‌ చేశారు. వీరికితోడు ఐదెన్‌ మార్‌క్రమ్‌ కూడా బ్యాట్‌ను ఝళిపించడం హైదరాబాద్‌కు సానుకూలాంశం. చెన్నైపై హాఫ్‌ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, కఠినమైన పిచ్‌పై దూకుడుగా ఆడటంలో హైదరాబాద్‌ బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. దానికి ఉదాహరణ గుజరాత్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌. అంతకుముందు ఉప్పల్‌లో రికార్డు స్కోరు చేసిన వీరే.. అహ్మదాబాద్‌లో మాత్రం 170 కూడా సాధించలేకపోయారు. అలాంటి లోటుపాట్లను సవరించుకుని బరిలోకి దిగాలి. 

శశాంక్‌.. బెయిర్‌ స్టోపై కన్నేస్తేనే..

పంజాబ్‌ బ్యాటింగ్‌ విభాగంలో శిఖర్ ధావన్‌, జానీ బెయిర్‌ స్టో ఓపెనింగ్‌ జోడీ అత్యంత కీలకం. వీరిద్దరూ గతంలో హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లే కావడం విశేషం. ధావన్‌ నిలకడగా పరుగులు చేస్తాడు. బెయిర్‌స్టో మాత్రం మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. మిడిలార్డర్‌లో జితేశ్, లివింగ్‌స్టోన్‌తోపాటు కొత్త స్టార్లుగా మారిన శశాంక్‌ సింగ్‌ - అషుతోష్‌ శర్మ కీలక ఇన్నింగ్స్‌లు ఆడతారు. వీరిని హైదరాబాద్‌ బౌలర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్, భువనేశ్వర్‌ కుమార్‌, జయ్‌దేవ్ ఉనద్కత్, నటరాజన్‌, మయాంక్‌ మార్కండే పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. నటరాజన్‌కు ఇది 50వ ఐపీఎల్ మ్యాచ్ కానుంది. లివింగ్‌స్టోన్‌ 89 పరుగులు, ఐదెన్‌ మార్‌క్రమ్‌ 98 పరుగులు చేస్తే 1000 రన్స్‌ క్లబ్‌లోకి వస్తారు. పంజాబ్‌ బౌలింగ్‌ విభాగం ఎక్కువగా కగిసో రబాడ, బ్రార్‌, హర్షల్‌ పటేల్‌పైనే ఆధారపడి ఉంది. హర్షల్‌ ప్రదర్శన తన స్థాయికి తగ్గట్టుగా లేదు. ముల్లాన్‌పుర్ పేస్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇదే స్టేడియంలో పంజాబ్‌ - దిల్లీ మ్యాచ్‌ జరిగింది. మొత్తం 15 వికెట్లు పడగా తొమ్మిదింటిని ఫాస్ట్‌ బౌలర్లే తీశారు. 

తుది జట్టు (అంచనా)

పంజాబ్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌ స్టో, ప్రభ్‌ సిమ్రన్ సింగ్, సామ్ కరన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్‌ సింగ్, లియామ్‌ లివింగ్‌స్టోన్, అషుతోష్‌ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ

హైదరాబాద్‌: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐదెన్ మార్‌క్రమ్, హెన్రిచ్‌ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీశ్‌ రెడ్డి, షహ్‌బాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌, మయాంక్‌ మార్కండే/జయ్‌దేవ్ ఉనద్కత్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని