Dravid: ఇప్పటికీ మా అమ్మ నా గురించి అలా అనుకోవడం లేదు: ద్రవిడ్

భారత క్రికెట్‌లో ప్రశాంతంగా ఉండే ప్లేయర్ అంటే ఠక్కున రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పేరు గుర్తుకొస్తుంది. సహచరులతో ఎప్పుడూ వాగ్వాదం జరిగినట్లు ఎక్కడా చూడలేదు. మరి అలాంటి ద్రవిడ్‌ కూడా అందరిని భయపెడితే ఎలా ఉంటుందో రెండేళ్ల కిందట ఓ యాడ్‌లో కనిపించాడు.

Updated : 12 Jul 2023 12:53 IST

ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల కిందట ఓ యాప్‌ ప్రచారం కోసం టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ (Rahul Dravid) చేసిన యాడ్‌ గుర్తుంది కదా.. ‘‘నేను ఇందిరానగర్‌ గూండా’ అంటూ ఆ యాడ్‌లో రాహుల్‌ అందరినీ భయపెడతాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ద్రవిడ్‌ ఇలాంటి యాడ్‌ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. తాజాగా విండీస్ పర్యటనలో ఉన్న ద్రవిడ్ అప్పటి ప్రచార చిత్రంపై స్పందించాడు. అభిమానులు, ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, తన తల్లి మాత్రం ఇప్పటికి తాను అలా చేయడం నమ్మలేదని ద్రవిడ్‌ తెలిపాడు.

‘‘అలాంటి యాడ్‌ చేసిన తర్వాత నన్ను చూసే విధానం మారింది. నేను ఎప్పుడు భగ్గుమంటానో అని ఆలోచిస్తున్నారు. అయితే.. ఆ యాడ్‌ పట్ల స్పందన బాగా వచ్చింది. అభిమానులు సానుకూలంగానే స్వీకరించారు. కానీ, మా అమ్మకు ఇంకా నమ్మకం కుదరలేదు. నేను గ్లాస్‌ను పగలకొడతానని ఇప్పటికీ నమ్మలేదు. ‘నువ్వు అలా ఆలోచిస్తున్నావా..?’ అని నాతో అంది. నేను ఇప్పటి వరకు చేసిన యాడ్స్‌లో ఇబ్బంది కలిగించింది ఇదొకటి. ముంబయి వీధుల్లో అలా చేయాల్సి వచ్చింది. ఇది యాడ్‌ అయినప్పటికీ మన చుట్టూ ప్రజలు ఉన్నారు. వారు యాక్టర్లు లేదా ఇతరులు అయి ఉండొచ్చు. నా మాదిరిగా నడి రోడ్డులో నిల్చుని అరుస్తూ, గోల చేస్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది’’ అని ద్రవిడ్ వివరించాడు.

విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడేందుకు భారత్ పర్యటిస్తోంది. ఇవాళ రాత్రి 7.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) వెస్టిండీస్‌తో డొమినికా వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ను కూడా ఇదే సిరీస్‌తో  ప్రారంభించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు