Jaddu : అప్పుడు జడేజా పరిస్థితి.. నీటిలో నుంచి బయటపడిన చేపలా తయారైంది: రవిశాస్త్రి

 చెన్నై జట్టు కెప్టెన్సీని ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు అప్పగించినప్పుడు అతడి పరిస్థితి నీటిలో నుంచి బయటపడిన చేపలా తయారై ఉంటుందని టీమ్ఇండియా మాజీ కోచ్...

Published : 12 May 2022 01:41 IST

ఇంటర్నెట్ డెస్క్: చెన్నై జట్టు కెప్టెన్సీని ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు అప్పగించినప్పుడు అతడి పరిస్థితి నీటిలో నుంచి బయటపడిన చేపలా తయారై ఉంటుందని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ‘‘ సహజంగా సారథ్య బాధ్యతలు చేపట్టే సామర్థ్యం జడేజాకు లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ స్థాయిలోనూ కెప్టెన్సీ నిర్వహించలేదు. అందుకే అతడికి చెన్నై జట్టు పగ్గాలు అప్పగించడంతో కష్టంగా అనిపించింది. అప్పటి నుంచి జడ్డూ నాయకత్వాన్ని అభిమానులు జడ్జ్‌ చేయడం ప్రారంభించారు. ఇందులో అతడి తప్పేమీ లేదు. జడేజా పరిస్థితి చేపలా తయారైంది. నీటిలో ఉంటే చేప ప్రశాంతంగా ఉంటుంది. అయితే బయటకొచ్చినప్పుడే విలవిలాడిపోతుంది. అదేవిధంగా జడేజా పరిస్థితి మారింది. అంతేకాకుండా తన ఆల్‌రౌండర్ ప్రదర్శనపై ప్రభావం చూపింది. ఇదే జడేజా కెప్టెన్‌గా విఫలం కావడానికి కారణం కావచ్చు. ఇప్పటికైనా తన ఆట మీద జడ్డూ దృష్టి సారించాలి’’ అని రవిశాస్త్రి సూచించాడు.

రవీంద్ర జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఎంఎస్ ధోనీ మరోసారి చెన్నై జట్టు పగ్గాలను చేపట్టాడు. ఈ క్రమంలో ధోనీ తర్వాత చెన్నైని నడపించే సారథి ఎవరనే చర్చ కొనసాగుతోంది. దీనిపైనా రవిశాస్త్రి స్పందించాడు. ‘‘ధోనీ తర్వాత ఎవరిని చెన్నై ఎంపిక చేస్తుంది? దీనికి సమాధానం కోసం వేచి చూడాల్సిందే. ఎందుకంటే బెంగళూరు టీమ్‌ కూడా డుప్లెసిస్‌ను మెగా వేలంలో దక్కించుకొని నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. అలానే వచ్చే సీజన్‌లో అవసరమైతే వేలానికి వెళ్లి అటువంటి ఆటగాడిని తీసుకునే అవకాశం లేకపోలేదు. అయితే ప్రస్తుతం జట్టులో ఉన్నవారిలో రుతురాజ్‌, మొయిన్‌ అలీ సహా ఇతర ప్లేయర్లనూ పరిశీలించొచ్చు. అయితే కెప్టెన్సీ చేయగలిగే సామర్థ్యం ఉన్నవారినే చెన్నై ఎంపిక చేసుకుంటుందని భావిస్తున్నా’’ అని రవిశాస్త్రి వివరించాడు. ప్రస్తుతం చెన్నై 11 మ్యాచులకుగాను నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని