WPL: ముంబయికి షాక్‌.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబయికి ఆర్సీబీ షాక్‌ ఇచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 

Updated : 15 Mar 2024 23:11 IST

దిల్లీ: డబ్ల్యూపీఎల్‌ (WPL) సీజన్‌-2లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore Women) ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians Women)ను ఆర్సీబీ (RCB) 5 పరుగుల తేడాతో ఓడించింది. 136 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 130 పరుగులకే పరిమితమైంది. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (33) కీలక సమయంలో ఔట్‌కావడంతో ముంబయికి ఓటమి తప్పలేదు. అమేలీ కెర్‌(27*), యాస్తికా భాటియా (19), హేలీ మ్యాథ్యూస్‌ (15), నాట్‌సీవర్‌ (23) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌ రెండు వికెట్లు తీయగా, ఎలీస్‌ పెర్రీ, జార్జియా వేర్‌హామ్‌, సోఫీ మోలినెక్స్‌, ఆషా శోభనా తలో వికెట్‌ తీశారు. లక్ష్యం స్వల్పమే కావడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడిన ముంబయి చివర్లో తడబడింది. బెంగళూరు బౌలర్లు కీలక సమయంలో అద్భుతంగా రాణించారు. ఈ ఆదివారం బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఫైనల్‌ జరగనుంది.  

అంతకుముందు టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. క్లిష్ట సమయంలో ఎలీస్‌ పెర్రీ (66: 50 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌) గొప్పగా రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (10), సోఫీ డివైన్‌ (10)తో పాటు దిశా కసత్‌ (0), రిచా ఘోష్‌ (14), సోఫీ మోలినెక్స్‌ (11) విఫలమయ్యారు. ముంబయి బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్‌, నాట్‌ సీవర్‌, సైకా ఇషాక్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని