
Rohit Sahrma: టీమ్‌ఇండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ?
ఇంటర్నెట్ డెస్క్: టీ20ల్లో విరాట్ కోహ్లి నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ.. త్వరలోనే టెస్ట్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత వైస్ కెప్టెన్ అజింక్యా రహానెను ఆ బాధ్యతల నుంచి తప్పించి హిట్‌మ్యాన్‌కి వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయట. వచ్చే వారంలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే వన్డే జట్టులో చోటు కోల్పోయిన రహానె.. గత రెండేళ్లుగా టెస్ట్‌ల్లో కూడా దారుణంగా విఫలమవుతున్నాడు.
ఈ ఏడాది ఇప్పటివరకు 12 టెస్టులు ఆడిన రహానె.. 19.57 సగటుతో 411 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల కాన్పూర్ వేదికగా కివీస్‌తో జరిగిన మొదటి టెస్టులోనూ పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. మొదటి ఇన్సింగ్స్‌లో 35 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులకే వెనుదిరిగాడు. మరో వైపు, టెస్ట్ క్రికెట్‌లో శ్రేయస్ అయ్యర్ అదిరిపోయేరీతిలో అరంగ్రేటం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టుతోనే ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ తొలి ఇన్నింగ్స్‌లో శతకం (105) బాదగా.. రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులతో రాణించాడు. దీంతో టెస్టులోనూ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో జరిగే దక్షిణాఫ్రికా టూర్‌కి ఎంపిక చేసే జట్టులో రహానెకు చోటు దక్కుతుందో లేదో చూడాలి.
► Read latest Sports News and Telugu News