PBKS vs RCB: అదరగొట్టిన సిరాజ్‌.. బెంగళూరుదే విజయం

ఐపీఎల్‌-16 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌కు మూడో విజయం. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.

Updated : 20 Apr 2023 19:37 IST

మొహాలి: ఐపీఎల్‌-16 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌కు మూడో విజయం. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.  టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.  లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 18.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్‌ అయింది. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆదిలో తైడే (4) వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ (46; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), వికెట్ల మధ్య పరుగులు రాబడుతున్నా, ఇంకో ఎండ్‌ నుంచి అతనికి సహకారం అందలేదు. మరోవైపు బ్యాట్స్‌మెన్‌పై బెంగళూరు బౌలర్లు ఒత్తిడి తేవడంతో మాథ్యూ షార్ట్‌ (8), లివింగ్‌స్టోన్‌ (2), హర్‌ప్రీత్‌ సింగ్‌ భాటియా (13), సామ్‌ కరన్‌ (10) వికెట్లు కోల్పోయింది. ప్రభ్‌సిమ్రన్‌ వికెట్‌ పడిన తర్వాత, మ్యాచ్‌ను ముందుకు నడిపే బాధ్యత జితేశ్ శర్మ (41; 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) తీసుకున్నాడు. ఒకానొక దశలో పంజాబ్‌ను విజయం వైపు నడిపేటట్లు కనిపించాడు. సిరాజ్‌ తన బౌలింగ్‌ మాయాజాలంతో వరుస వికెట్లు తీయడంతో విజయం బెంగళూరును వరించింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌ 4 వికెట్లు, హసరంగ రెండు.. పార్నెల్, హర్షల్‌ పటేల్‌ చెరో వికెట్ తీశారు.

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (59; 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), డు ప్లెసిస్‌ (84; 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ శతకాలతో మెరిశారు. మ్యాక్స్‌వెల్ (0) డకౌటయ్యాడు. దినేశ్ కార్తిక్‌ (7) కూడా విఫలమయ్యాడు. మహిపాల్ లోమ్రోర్ (7*), షాబాజ్‌ అహ్మద్‌ (5*) నాటౌట్‌గా నిలిచారు. కోహ్లీ, డు ప్లెసిస్‌ తొలుత దూకుడుగా ఆడటంతో 11 ఓవర్లకు 98/0తో నిలిచింది. దీంతో ఆర్సీబీ స్కోరు 200 దాటేలా కనిపించింది. అయితే, తర్వాత పంజాబ్‌ బౌలర్లు పుంజుకోవడంతో స్కోరు వేగం తగ్గింది. తొలి వికెట్‌కు కోహ్లీ, డు ప్లెసిస్‌ ద్వయం 137 పరుగులు జోడించారు. హర్‌ప్రీత్‌ బ్రార్‌ వేసిన 17 ఓవర్‌లో మొదటి బంతికి విరాట్ కోహ్లీ (59), తర్వాతి బంతికే మ్యాక్స్‌వెల్ (0) డకౌటయ్యాడు. కోహ్లీ.. వికెట్ కీపర్‌ జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇవ్వగా.. మ్యాక్స్‌వెల్ అథర్వ తైడేకు చిక్కాడు. నాథన్‌ ఎల్లిస్‌ వేసిన 18 ఓవర్‌లో డు ప్లెసిస్‌ లాంగాఫ్‌లో సామ్‌ కరన్‌కు చిక్కాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19 ఓవర్‌లో దినేశ్‌ కార్తిక్‌ అథర్వ తైడేకు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో ఆర్సీబీ అనుకున్న దానికన్నా తక్కువ స్కోరుకే ఇన్నింగ్స్‌ను ముగించింది. పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2, నాథన్‌ ఎల్లిస్‌, అర్ష్‌దీప్‌ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని