Sachin Tendulkar: అసాధ్యాన్ని సుసాధ్యం చేశావు.. దివ్యాంగ క్రికెటర్‌కు సచిన్‌ ప్రశంసలు

రెండు చేతులు లేకున్నా క్రికెట్ ఆడుతున్న దివ్యాంగ క్రికెటర్‌పై సచిన్ తెందూల్కర్‌ (Sachin Tendulkar) ప్రశంసల జల్లు కురిపించాడు. 

Updated : 13 Jan 2024 17:14 IST

ఇంటర్నెట్ డెస్క్: రెండు చేతులు లేకపోయినా క్రికెట్‌ ఆడుతూ అబ్బురపరుస్తున్నాడు జమ్ముకశ్మీర్‌కు చెందిన అమీర్‌ హుస్సేన్‌ (Amir Hussain). 8 ఏళ్ల వయసులోనే తండ్రి మిల్లులో జరిగిన ఓ ప్రమాదంలో అమీర్ తన రెండు చేతులూ కోల్పోయాడు. అయినా అతడు కుంగిపోలేదు. అమీర్‌లోని ప్రతిభను గుర్తించిన ఓ ఉపాధ్యాయుడు అతను క్రికెట్ ఆడేలా ప్రోత్సహించాడు. ఇప్పుడతను పారా క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మెడ, భుజం సాయంతో బ్యాట్‌ పట్టుకుని బ్యాటింగ్‌ చేస్తున్నాడు. షాట్లూ కొడుతున్నాడు. చేతిని తిప్పి వేసినట్లుగానే కుడి కాలి వేళ్ల మధ్య బంతిని ఇరికించుకుని, కాలిని తిప్పి బౌలింగ్‌ వేస్తున్నాడు. 2013 నుంచి ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడుతున్న 34 ఏళ్ల అమీర్‌ ఇప్పుడు జమ్ముకశ్మీర్‌ పారా క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌. సచిన్‌ తెందూల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లిలను ఆరాధించే అమీర్‌ వాళ్లను కలవాలని కోరుకుంటున్నాడు. ఇతడు క్రికెట్ ఆడుతున్న వీడియోని సచిన్‌ సోషల్ మీడియాలో చూసి స్పందించాడు.  

‘‘అమీర్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అతడి వీడియో నన్ను ఎంతగానో కదిలించింది. అందులో ఆటపై అతడికున్న ప్రేమ, అంకితభావం కనిపించాయి. ఏదో ఒక రోజు అమీర్‌ను కలిసి అతడి పేరుతో ఉన్న జెర్సీని బహుమతిగా  తీసుకుంటా. క్రీడల్లో రాణించాలనుకునే లక్షల మందికి అతడు స్ఫూర్తిగా నిలిచాడు’’ అని రాసుకొచ్చి ఆ వీడియోని ఎక్స్‌ (ట్విటర్‌)లో ట్యాగ్‌ చేశాడు సచిన్‌ .

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని