Sanju Samson: సంజూ శాంసన్‌ ఆ వైఖరిని మార్చుకోవాలి: శ్రీశాంత్‌

Sanju Samson: ప్రపంచకప్‌ జట్టులోకి సంజూ శాంసన్‌ను తీసుకోకపోవడంపై అతని అభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే, ఇది సరికాదని మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.

Updated : 24 Sep 2023 12:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచకప్‌ (World Cup 2023)నకు టీమ్‌ఇండియా జట్టును ప్రకటించినప్పటి నుంచి క్రికెట్‌ వర్గాల్లో సంజూ శాంసన్‌ (Sanju Samson) గురించి చర్చ జరుగుతోంది. 15 మందితో కూడిన ప్రపంచకప్‌ (World Cup 2023) టీమ్‌తో పాటు ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు కూడా అతణ్ని ఎంపిక చేయని విషయం తెలిసిందే. దీంతో అతని అభిమానుల నుంచి తీవ్ర నిరాశ, అసంతృప్తి వ్యక్తమవుతోంది. పలువురు శాంసన్‌పై సానుభూతి వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా దీనిపై టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు శ్రీశాంత్‌ స్పందించాడు. శాంసన్‌ (Sanju Samson) పట్ల వస్తున్న సానుభూతిపై ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.

శాంసన్‌ను ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోకపోవడం బహుశా సరైన నిర్ణయమే అయి ఉండొచ్చని శ్రీశాంత్‌ అభిప్రాయపడ్డాడు. ఒక ఆటగాడు తనని తాను అర్థం చేసుకోవడం చాలా అవసరమని వ్యాఖ్యానించాడు. గావస్కర్‌, హర్షా బోగ్లే, రవి శాస్త్రి సహా ప్రతిఒక్కరూ శాంసన్‌ను మంచి ఆటగాడిగా గుర్తించారని తెలిపాడు. అతని సామర్థ్యంపై ఎలాంటి అనుమానం అవసరం లేదన్నాడు. కానీ ‘‘పిచ్‌కి అనుగుణంగా ఆడాలని ఎవరైనా సూచిస్తే మాత్రం వినడు. ఆ వైఖరిని మార్చుకోవాలి’’ అని శ్రీశాంత్‌ సూచించాడు.

ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు: హర్భజన్‌ సింగ్

తానెప్పుడూ సంజూ (Sanju Samson)కి ఒక విషయం చెబుతానని శ్రీశాంత్‌ తెలిపాడు. ప్రతి బౌలర్‌పై విరుచుకుపడకుండా.. వికెట్‌ను అర్థం చేసుకోవాలని సూచిస్తానని వెల్లడించాడు. ఎవ్వరి బౌలింగ్‌లోనైనా.. ఎక్కడైనా బాగా ఆడతావని.. అయితే అవకాశం చూసుకుని ఆడొచ్చని చెబుతానని తెలిపాడు. ‘‘నాతో సహా ప్రతిఒక్క మళయాళీ.. సంజూకు అవకాశాలు రావడం లేదని అంటున్నాం. కానీ, అలా అనడం సరికాదు. ఐర్లాండ్‌, శ్రీలంకపై అతనికి మంచి అవకాశం వచ్చింది. పదేళ్లుగా ఐపీఎల్‌ ఆడుతున్నాడు. 2013 నుంచి ఆటలో ఉన్నాడు. కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. కానీ, మూడు శతకాలు మాత్రమే బాదాడు. అలాగే ఆటలో ఎక్కడా స్థిరత్వం చూపించలేదు. సమయం ఎవరి కోసం ఆగదు. ప్రతిభ ఉన్న కొత్త ఆటగాళ్లు చాలా మంది వస్తున్నారు. ఆసియా క్రీడలకు ఇద్దరు కీపర్లు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ నీ (శాంసన్‌) గురించి మాట్లాడుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సానుభూతి పొందడం చాలా సులభం. కానీ, మెప్పు పొందడం చాలా కష్టం’’ అని శ్రీశాంత్‌ అన్నాడు.

అయితే, శాంసన్‌ (Sanju Samson) తిరిగి జట్టులోకి వస్తాడనే విశ్వాసం తనకు ఉందని శ్రీశాంత్‌ అన్నాడు. కొంచెం తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే అన్ని ఫార్మాట్లలో రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కేవలం ఐపీఎల్‌కి మాత్రమే ఆడడం ద్వారా శాంసన్‌ (Sanju Samson) లాంటి ప్రతిభ ఉన్న ఆటగాణ్ని టీమ్‌ఇండియా కోల్పోకూడదని తాను కోరుకుంటున్నానన్నాడు. కానీ, శాంసన్‌ తన వైఖరిని మార్చుకుంటాడని మాత్రం తాను అనుకోవడం లేదని శ్రీశాంత్‌ చెప్పడం గమనార్హం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు