Sachin - Sehwag: ముల్తాన్‌ టెస్టులో సిక్స్‌ కొడతానంటే.. సచిన్‌ అలా అనేశాడు: సెహ్వాగ్‌

భారత ఓపెనింగ్‌ జోడీల్లో సచిన్ - గంగూలీ తర్వాత.. సెహ్వాగ్‌ - సచిన్‌ (Sehwag - Sachin) జోడీదే టాప్‌. ఇద్దరూ దూకుడుగా ఆడేవారైనప్పటికీ సెహ్వాగ్‌ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడతాడు.

Published : 21 Mar 2023 15:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag) బ్యాటింగ్‌ శైలి విభిన్నం. అతడు క్రీజ్‌లో ఉన్నాడంటే ఎంతటి భీకర బౌలర్‌ అయినా సరే తడబాటుకు గురి కావాల్సిందే. సాధారణంగా బ్యాటర్లు సెంచరీ, డబుల్‌, ట్రిబుల్‌ సెంచరీ మార్క్‌కు చేరువగా వచ్చినప్పుడు ఆచితూచి ఆడుతూ ఉంటారు. కానీ, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం బౌండరీతోనే ఆ మార్క్‌ను దాటేయాలని భావిస్తుంటాడు. ఒక్కోసారి ప్రత్యర్థికి దొరికిపోయి ఔట్‌గా పెవిలియన్‌కు చేరిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాగే పాక్‌తో ముల్తాన్‌ టెస్టులోనూ సిక్స్‌లు కొట్టేందుకు ప్రయత్నించగా.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin) వారించాడని సెహ్వాగ్‌ గుర్తు చేసుకున్నాడు. 

‘‘నేను చిన్పప్పటి నుంచి టెన్నిస్‌ బాల్‌తో క్రికెట్‌ ఆడేవాడిని. బౌండరీల ద్వారానే ఎక్కువ పరుగులు రాబట్టాలని నా మైండ్‌ సెట్‌ అయిపోయింది. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఇలానే భావించా. సెంచరీ చేయాలంటే ఎన్ని బౌండరీలు కావాలో లెక్కలేసుకొనేవాడిని. నేను 90ల్లోకి వచ్చిన తర్వాత శతకం చేయాలంటే కనీసం ఓ పది బంతులను తీసుకుంటే.. నన్ను ఔట్‌ చేయడానికి ప్రత్యర్థి బౌలర్లకు పది అవకాశాలు ఇచ్చినట్లు అవుతుంది. అదే కేవలం రెండు బంతుల్లోనే కొట్టేందుకు ప్రయత్నిస్తే.. నన్ను అడ్డుకోవడానికి వారికి ఉండే ఛాన్స్‌ను రెండు బంతులకే తగ్గించినట్లు అవుతుంది. అప్పుడు రిస్క్ పర్సంటేజీ 100 నుంచి 20కి పడిపోతుంది’’ అని సెహ్వాగ్‌ వివరించాడు.

మూడంకెల స్కోరుకు చేరే క్రమంలో బౌండరీలు కొట్టడంపై తనను సచిన్‌ సున్నితంగా మందలించాడని సెహ్వాగ్ తెలిపాడు. ‘‘ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా సైమన్ కటిచ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి 195 పరుగుల వద్దకు చేరా. మరో షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరా. అయితే ఆ మ్యాచ్‌లో మేం ఓడిపోయాం. ఇక పాక్‌తో ముల్తాన్‌ టెస్టులోనూ ఆరేడు సిక్స్‌లతో సెంచరీని పూర్తి చేశాను. అప్పుడు సచిన్‌ నా దగ్గరకు వచ్చి ‘మళ్లీ సిక్స్‌ కానీ కొట్టావంటే.. నిన్ను నేను బ్యాట్‌తో కొడతా’ అని హెచ్చరించాడు. ఎందుకు అని నేను అడిగా.  దానికి సమాధానంగా ఆసీస్‌తో జరిగిన టెస్టులో నేను సిక్స్‌ కొట్టడం వల్లే ఓడిపోయినట్లు సచిన్‌ చెప్పాడు. అందుకే ముల్తాన్‌ టెస్టులో 120 నుంచి 295 పరుగుల వరకు ఒక్క సిక్స్‌ కొట్టలేదు. అప్పుడు సచిన్‌ దగ్గరకు వెళ్లి ‘ట్రిపుల్‌ సెంచరీ కోసం నేను సిక్స్‌ కొడతా..’ అని చెప్పా. అంతే సచిన్‌ ‘నీకేమైనా పిచ్చా..? ఇప్పటి వరకు ఎవరూ భారత్‌ తరఫున ట్రిపుల్‌ సెంచరీ కొట్టలేదు’’అని అన్నాడు. అలాగే 295 పరుగులు కూడా ఎవరూ కొట్టలేదు అని నేను బదులిచ్చా. ఆ వెంటనే ముస్తాఖ్ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి త్రిశతకం సాధించా. అప్పుడు నాకంటే సచిన్‌ చాలా సంతోషించాడు’’ అని సెహ్వాగ్‌ వెల్లడించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు