Mohammed Shami: టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ షమీకి షాక్‌.. మాజీ భార్యకు భరణం ఇవ్వాల్సిందే..

మాజీ భార్య వేసిన కేసులో టీమ్‌ఇండియా పేసర్‌ మహమ్మద్‌ షమీ(Mohammed Shami)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు భరణం చెల్లించాల్సిందిగా కోర్టు ఉత్తర్వులిచ్చింది,

Updated : 24 Jan 2023 20:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ(Mohammed Shami)కి షాక్‌. మాజీ భార్య హసీన్‌ జహాన్‌కు షమీ నెలకు రూ.1.30 లక్షల భరణం చెల్లించాలని కోల్‌కతా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.50 వేలు మాజీ భార్య ఖర్చుల నిమిత్తం కాగా.. మిగతా రూ.80 వేలు వారి కుమార్తె పోషణ కోసం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. వీరు విడిపోయిన అనంతరం కుమార్తె హసీన్‌ వద్దే ఉంది.

2018లో షమీ తనపై గృహహింసకు పాల్పడుతున్నాడని హసీన్‌ కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ పోలీసుస్టేషన్‌ను  ఆశ్రయించింది. దీంతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అదే సమయంలో తమ ఖర్చుల కోసం భరణం కింద నెలకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఆమె కోర్టులో కేసు వేసింది. ఇందులో రూ.7లక్షలు తన ఖర్చుల నిమిత్తం కాగా.. మిగతా రూ.3 లక్షలు కూతురి కోసమని పేర్కొంది. దీనిపై వాదనలు విన్న కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. అయితే.. తాజా తీర్పుపై హసీన్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తీర్పును ఆమె ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేయనున్నట్లు తెలుస్తోంది.

హసీన్‌ జహాన్‌ను షమీ 2014లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని