SA vs IND: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌.. వన్డేలకు చాహర్‌.. టెస్టులకు షమీ దూరం

టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాళ్లు షమీ, దీపక్ చాహర్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు (IND vs SA) దూరమయ్యారు. వన్డే సిరీస్‌కు ఎంపికైన చాహర్‌ స్థానంలో మరొకరిని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. 

Updated : 16 Dec 2023 17:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా (IND vs SA) పర్యటనలో ఉంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి (డిసెంబర్‌ 17) వన్డే సిరీస్‌ మొదలు కానుంది. అయితే, ఆల్‌రౌండర్‌ దీపక్ చాహర్‌ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. తన తండ్రి అత్యవసర వైద్య పరిస్థితి కారణంగా భారత్‌లోనే ఉండిపోయిన దీపక్‌.. 50 ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌లోనూ ఆడేందుకు అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించింది. అతడి స్థానంలో ఆకాశ్‌ దీప్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. తొలి వన్డే నాటికి జట్టుతోపాటు అతడు చేరే అవకాశం ఉంది. వన్డే సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ వ్యవహరిస్తాడు. జట్టులో ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ తొలి మ్యాచ్‌ మాత్రమే ఆడతాడు. తర్వాతి రెండు వన్డేలు ఆడడు. టెస్టు సిరీస్‌ కోసం సన్నద్ధమయ్యేందుకే ఈ నిర్ణయమని బీసీసీఐ వెల్లడించింది. 

వన్డే సిరీస్‌కు భారత్ జట్టు: రుతురాజ్‌ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్‌ వర్మ, రజత్‌ పటీదార్‌, రింకు సింగ్‌, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆకాశ్ దీప్‌

ఫిట్‌నెస్‌ సాధించని షమీ

గాయం కారణంగా వరల్డ్‌ కప్‌ తర్వాత క్రికెట్‌కు దూరమైన షమీ ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడంలో విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసినా.. ఫిట్‌నెస్‌ టెస్టులో పాసైతేనే జట్టులో చోటు కల్పిస్తామని అప్పుడే సెలక్షన్‌ కమిటీ వెల్లడించింది. తాజాగా ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడంలో విఫలం కావడంతో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉంటాడని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. అయితే, అతడి స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌లకు దూరంగా ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మతోపాటు స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ, పేసర్‌ బుమ్రా టెస్టు సిరీస్‌లో పాల్గొంటారు. టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు డిసెంబర్‌ 26 నుంచి, రెండో టెస్టు జనవరి 3 నుంచి ప్రారంభమవుతాయి. 

టెస్టు సిరీస్‌కు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, రుతురాజ్‌ గైక్వాడ్, రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, బుమ్రా, ప్రసిధ్ కృష్ణ

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత్‌కు కొత్త కోచింగ్ స్టాఫ్‌ 

దక్షిణాఫ్రికాతో డిసెంబరు 17 నుంచి ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్‌కు హెడ్‌ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు బ్యాటింగ్ కోచ్‌ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాజ్ మంబ్రే, ఫీల్డింగ్ కోచ్‌ దిలీప్ అందుబాటులో ఉండట్లేదు. వీరు వన్డే సిరీస్ అనంతరం సఫారీలతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ ప్రిపరేషన్స్‌పై దృష్టిపెట్టనున్నారు. దీంతో వన్డే సిరీస్‌లో ఇండియా ఎ కోచింగ్ బృందం భారత జట్టుకు సహాయం చేయనుంది. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, బౌలింగ్ కోచ్ రాజీబ్ దత్తా, ఫీల్డింగ్ కోచ్ అజయ్ రాత్రాలతో కూడిన ఇండియా ఎ కోచింగ్ స్టాఫ్‌ అందుబాటులో ఉండనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని