IND vs SA: ఆ బౌలర్‌తో జాగ్రత్తగా ఉంటాం.. సౌతాఫ్రికా కెప్టెన్‌ బవుమా

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ రేపటి నుంచే ప్రారంభం కానుంది. భారత్‌, సఫారీ జట్లు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ మైదానంలో తమ మొదటి మ్యాచ్‌ను ఆడనున్నాయి........

Published : 27 Sep 2022 21:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ రేపటి నుంచే ప్రారంభం కానుంది. భారత్‌, సఫారీ జట్లు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ మైదానంలో తమ మొదటి మ్యాచ్‌ను ఆడనున్నాయి. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా సారథి తెంబా బవుమా విలేకర్లతో మాట్లాడాడు. భారత్‌లో కొత్త బంతిని ఎదుర్కోవడం చాలా కష్టమని.. ముఖ్యంగా జస్ప్రీత్‌ బుమ్రాతో జాగ్రత్తగా ఉంటామని పేర్కొన్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పవర్‌ప్లేలో స్వింగ్‌ బంతులను ఆడటం తమ జట్టుకు ప్రధాన సవాల్‌ అని పేర్కొన్నాడు.

‘భారత్‌లో కొత్త బంతిని ఎదుర్కోవడం సవాల్‌తో కూడుకున్న విషయం. భారత బౌలర్లు బంతిని మరింత స్వింగ్ చేయగలరు. దక్షిణాఫ్రికాలో మేం అలవాటు పడిన దానికంటే ఇది కొంచెం ఎక్కువ. అందుకే మొదట వికెట్లు కాపాడుకోవడం ఎంతో కీలకం. కొత్త బంతితో బుమ్రాను అడ్డుకోవడం మాకు పరీక్షే. ఉత్తమ జట్టుతో పోటీ పడుతున్నాం. ఇందుకు అత్యుత్తమంగా రాణించాల్సి ఉంటుంది’ అని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ అన్నాడు.

ఈ రెండు జట్లు తలపడిన చివరి సిరీస్‌ 2-2తో డ్రాగా ముగిసింది. నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో రెండు జట్లు సిరీస్‌ను సమంగా పంచుకున్నాయి. కాగా ఈ సిరీస్‌ గురించి బవుమా తాజాగా మాట్లాడాడు. ‘చివరిసారి మేము ఇక్కడ ఆడినప్పుడు పలు పరీక్షలు, సవాళ్లు ఎదురయ్యాయి. వాటికి మేము దీటుగా బదులిచ్చాం. ఇప్పుడు జరగబోయే సిరీస్‌లోనూ సమర్థంగా ఆడతాం. ప్రపంచకప్‌కి ముందు జరిగే ఈ సిరీస్ మా జట్టులోని లోపాలను సరిచేసుకునేందుకు సహాయపడుతుందని భావిస్తున్నా’ అని బవుమా పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని