SA vs IND: జోర్జి సెంచరీ.. రెండో వన్డేలో భారత్‌కు షాక్‌ ఇచ్చిన సఫారీలు

సిరీస్‌పై కన్నేసిన భారత్‌కు ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు షాక్‌ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Published : 19 Dec 2023 23:34 IST

గబెరా: సిరీస్‌పై (SA vs IND) కన్నేసిన భారత్‌కు ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు షాక్‌ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 212 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సఫారీలు 42.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఓపెనర్‌ టోనీ డి  జోర్జి (119*) శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్ రిజా హెండ్రిక్స్‌ (52) అర్ధ శతకం బాదాడు. వాండర్ డసెన్ (36) రాణించాడు. తొలి మ్యాచ్‌లో సఫారీలను బెంబేలెత్తించిన భారత బౌలర్లు ఈమ్యాచ్‌లో తేలిపోయారు. అర్ష్‌దీప్‌, రింకు సింగ్‌ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించడంతో సిరీస్‌ 1-1 సమం అయింది. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిరీస్‌ నిర్ణయాత్మక పోరు గురువారం (డిసెంబరు 21న) జరుగనుంది.  

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటయ్యింది. సాయి సుదర్శన్‌ (62; 83 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా రెండో మ్యాచ్‌లో అర్ధ శతకం బాదగా, కెప్టెన్ కేఎల్ రాహుల్ (56; 64 బంతుల్లో 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ మినహా జట్టులో మరెవరూ భారీ స్కోర్లు నమోదు చేయలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రి బర్గర్ 3, బ్యురాన్ హెండ్రిక్స్‌ 2, కేశవ్‌ మహరాజ్‌ 2, లిజాడ్ విలియమ్స్‌, మార్‌క్రమ్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని