Mumbai Indians - Rohit Sharma: అందుకే రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించారు: సునీల్ గావస్కర్

రోహిత్‌ శర్మను ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) సారథ్య బాధ్యతల నుంచి తప్పించడానికి గల కారణాలను భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) విశ్లేషించాడు.

Published : 18 Dec 2023 18:51 IST

ఇంటర్నెట్ డెస్క్: ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పిస్తూ గుజరాత్ టైటాన్స్‌ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్‌ పాండ్యకు సారథ్య బాధ్యతలు అప్పగించింది ఆ ఫ్రాంఛైజీ. ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. జట్టుకు ఐదుసార్లు టైటిల్‌ అందించిన రోహిత్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని కొంతమంది సమర్థిస్తుండగా.. మరికొందరు తప్పుబడుతున్నారు. భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తాజాగా ఈ అంశంపై మాట్లాడాడు. రోహిత్‌ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించడానికి గల కారణాలను విశ్లేషించాడు. 

‘‘మనం తప్పొప్పుల జోలికి వెళ్లకూడదు. కానీ, జట్టుకు ప్రయోజనం చేకూర్చడం కోసమే వారు ఆ నిర్ణయాన్ని తీసుకుని ఉంటారు. గత రెండేళ్లుగా రోహిత్ బ్యాటింగ్‌లో కాస్త వెనుకబడ్డాడు. అంతకుముందు సీజన్లలో అతడు పెద్ద స్కోర్లు చేశాడు. గత రెండు సీజన్లలో ముంబయి టైటిల్ గెలవలేదు. 2022లో పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కి చేరింది. నిరంతరంగా క్రికెట్ ఆడుతూ అంతర్జాతీయ క్రికెట్‌, ఐపీఎల్‌లో సారథ్య బాధ్యతలతో రోహిత్‌ కాస్త అలసిపోయి ఉండొచ్చు. హార్దిక్‌ పాండ్య యువ కెప్టెన్‌గా మంచి ఫలితాలు సాధించాడు. దీనిని దృష్టిలో ఉంచుకుని అతడిని ముంబయి సారథిగా చేసిందని భావిస్తున్నా. హార్దిక్ గుజరాత్‌ను రెండుసార్లు ఫైనల్స్‌కు తీసుకెళ్లడమే కాకుండా 2022లో ఛాంపియన్‌గా నిలిపాడు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని కొత్త ఉత్సాహంతో ఉన్న హార్దిక్‌ను ముంబయి కెప్టెన్‌గా చేసిందనుకుంటున్నా. ఈ నిర్ణయంతో ముంబయి ఇండియన్స్‌కు నష్టం ఉండదు. ప్రయోజనమే ఉంటుంది’’ అని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.


సీఎస్కేలో ధోనీ.. ముంబయిలో రోహిత్‌ : ఇర్ఫాన్‌ పఠాన్  

ముంబయి ఇండియన్స్ బలమైన జట్టుగా మారడానికి రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఎనలేని కృషి చేశాడని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్ (Irfan Pathan) పేర్కొన్నాడు. ‘‘ముంబయి ఇండియన్స్‌లో ప్రత్యేక స్థానం ఉంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌లో ధోనీకి ఎలాంటి విశిష్ట గుర్తింపు ఉందో ముంబయి జట్టులో రోహిత్‌కు ఆ స్థాయి ఉందని నా అభిప్రాయం. రోహిత్‌ కెప్టెన్‌గా ఎంతో కష్టపడి బలమైన జట్టుగా తయారు చేశాడు. అతడు అద్భుతమైన కెప్టె్న్. బౌలర్లకు మద్దతుగా నిలుస్తాడు. 2023 సీజన్‌కు  స్టార్‌ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, జోఫ్రా అర్చర్‌ అందుబాటులో లేకున్నా జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ వివరించాడు. 

హార్దిక్‌ పాండ్యను ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా నియమించడాన్ని ఇర్ఫాన్‌ సమర్థించాడు. అయితే.. రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, జస్‌ప్రీత్ బుమ్రా వంటి అనుభవజ్ఞులు ఉన్న జట్టుకు నాయకత్వం సవాల్‌తో కూడుకున్నదని అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని